27, డిసెంబర్ 2012, గురువారం

వలపు వన్నెలసోన


వలపు వన్నెలసోన
చురుకు చూపుల జాన
సొగసులన్నీ నింపి
కులుకుతూ అడుగేస్తుంటే
నింగి నుండి చంద్రుడు
తొంగి చూడడామరి

లేత బుగ్గల లేడి
కలువ కన్నుల నారి
జాబిలంటి మోముతో
సిగ్గుపడి నవ్వితే
అందమయిన పువ్వులన్నీ
మూతి ముడవవా మరి

కోయిల కంఠంతో
ఓయ్ అని పిలుస్తుంటే
ఆ పిలుపు తాలూకు
జ్ఞాపకాలతో మైమరచి
ఒళ్ళు మరవరా ఆమె అభిమానులు

సుతిమెత్తని ఆ పాదాలు
తాకిన ఆ నేల ముద్దాడిన
అనుభూతి పొందుతూ
గాలికి తనపై రాలిన
పూలనే విస్మరించినే

హొయలయిన ఆ సిగలోకి
చేరాలని మొగ్గలన్నీ
తొందర పడుతూ
ఉదయంకై వేచిచూస్తు
తామే చేరాలని వాదులాడుకున్నయట

పేదవారు

పేదవారు, పీడితులు, సంఘంచే అంటరాని వారు అనబడేవారు, అనాధలు, వారి వారి గుండెల్లొ వేదనలను కవితలుగా వ్రాస్తే, మొదట రాయడానికి పదాలు దొరకవు, రాసినా చదివేందుకు ధైర్యం చాలదు. వారి ఆక్రందనలు, ఆక్రోశాలు, ప్రస్పుటంగా ఊహలకందని భాషల్లొ, పదాలతో కవితంతా నిండి ఉంటాయి. ఆ కవిత చదివి అర్ధం చేసుకొని భరించగలిగే శక్తి ఉంటే వారిని ఇలా ఈ సంఘం పీడించదు. ఆ కవిత రగిల్చే మంటల్లో మసై పోతారు. వారిలో ఇంత ఆక్రందన దాగుందా అని ఆశ్చర్యంలో మునిగి తేలుతారు. వారూ మానవులే అని మరచి ఇన్నాళ్ళూ కళ్ళు మూసుక పోయిన కుటిల నాయకులంతా కంగారు పడతారు. వారి పట్ల సమాజం ప్రవర్తిస్తున్న తీరు, వారిలో ఆగ్రహాల జ్వాలలను రగిలించినా, వారి ఆకలి కేకలు సమాజం చెవిని చేరుకున్న, వారి చావులు సమాజం హృదయాన్ని కరిగించకున్నా, గుండెలోతుల్లో రక్తం మరుగుతున్నా, ఏమీ చేయలేని నిస్సాహాయత, ఎదిరించే బలం లేదు. ఎదిరించినా అణగార్చ బడ్డవారు. వారి ఆవేదన ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేం. ఊహించలేం కదూ. అందుకే వారి ఆవేశాలు, ఆక్రోశాలు కవితగా రాస్తే ఆ పదజాలం నిప్పులు కక్కుతుంది. ఆ కవితలు మంటలు రేపుతాయి. పేలిన అగ్ని పర్వతంలాగా లావా చిందిస్తూ వారి హృదయాంతరాళాల నుండి ఒక్కసారిగా పెల్లుబికిన కవితాగ్ని కణాలకు ఎదురు నిలువ లేక సమాజం భీతిల్లవచ్చు.

కవిత


ఏదో కాగితం కలంపట్టి
కాస్త ఆలోచించి రాసేది
కవిత కాదు

మనసు స్పందించి
హృదయపు లోతులనుండి
ఆర్ద్రత తో బయటకు పొంగే
భావనే నిజమయిన కవిత

కవిత మనసులో మాటను చెప్పాలి
కవిత మనిషి ఆలోచనలను
కాగితం పై ఉంచాలి
కవిత జనం గుండెల్ని తాకేలా ఉండాలి
కవిత వ్యవస్థ బాగోగులను కోరాలి
కవిత సమాజంలో మార్పును కోరాలి
కవిత మంచిని ప్రభొదించాలి
కవిత కవి వ్యక్తిత్వానికి దర్పణం కావాలి !!

చిరునవ్వుల చిన్నారిచిరునవ్వుల చిన్నారివే
వరమల్లే దొరికావే !
సిరిమల్లెల సింగారివే
నా మనసే దోచావే !!

జడివానలో తడిసి నీవు
నెరజానల్లే వస్తవుంటే
తడిసిన నీ సోకుసూసి
నా గుండె జల్లుమందె !
నా వళ్ళు జిల్లుమందె !!

పరుగున ఇంటికి సేరి
నేతచీర గట్టి
తలార బోసుక కూకంటే
నా మనసు వల్లనందే !
నా వయసు ఆగనందే !!

తెల్లవారే యేళ
మంచుకురిసిన నేల
వయ్యారంగా కూకొని
నువ్వట్ల ముగ్గెడుతూ
నన్నట్ల కవ్విస్తాంటే
నిన్నెట్ట విడిసేదే ఓ పిల్ల !
నన్నునే మరచానే నా పిల్ల !!

కళ్ళకాటకనెట్టి
జడన మల్లెలు చుట్టి
వంటికి ఓణీ కట్టి
నీవట్ట తిరుగుతాంటే
నే గుట్టుగెట్టుండేదే ఓ పిల్ల !
నిన్ను చుట్టుకుంటానే నా పిల్ల !!

తొలకరి

బీటలు వారిన భూమి చినుకు స్పర్శకు
పరవశించి పరిమళించింది !!

ఆ పరిమళం ఆస్వాదించి మనసు
ఆనందించింది
దాహార్తితో అలమటించిన జనం
గొంతులు తడిపింది
తొలకరి చినుకు తాకిన
అనుభూతి మదిని తాకింది
తడి ఆవిరి అయిన మోములలో
ఆనందపు తడి తాండవించింది
చెట్టు పుట్ట, కొండ, బండ వేడినిట్టూర్పులు
మరచి కాస్త చల్లబడ్డాయి !!
తొలకరి తో ఆనందించిన రైతన్న
నాగలితో కదిలాడు
పొలం పనులు మొదలంటూ రెండు నెలల
విశ్రాంతికి వీడ్కోలు పలుకుతూ వ్యవసాయ కూలీలు
అటకెక్కించిన పుస్తకాల బూజు దులుపుతూ,
స్కూలు యూనిఫామ్ ధరించి
వెనుక పుస్తకాలను తగిలించి
ఆట పాటలకు సమయం తీరిందంటూ
కదిలిన విద్యార్ధులు,
ఎటు చూసినా హడావిడే !!

తొలకరి తెచ్చింది కోలహలం
తొలకరి ఇచ్చింది ఆనందం
తొలకరి పనులకు నాంది పలికింది
తొలకరి ఇక లేవండంటూ పిలుపందించింది
తొలకరి సోమరితనాన్ని వదిలించింది
శ్రమించండంటూ వర్తమానం అందించింది !!