4, డిసెంబర్ 2012, మంగళవారం


జలం  -  గళం

 

చినుకు చినుకు కలిస్తేనే జలం

పాయ పాయ కలిస్తేనే నదీ ప్రవాహం

చేయి చేయి కలిపి ముందుకు సాగితే అది సమైక్యవాదం

గళం గళం కలిపి పోరు బాట పడితే అది విప్లవ గీతం

ప్రవాహ వేగాన్ని ఏ ఆనకట్ట నిరోధించగలదు

రగులుతున్న గుండె ఘోషలను ఏ నిశ్శబ్దం దాచగలదు

హిమం కరిగితే జీవనది

గుండె కదిలితే విప్లవ ఝరి

నీరు ఎండితే ఎడారి

గళం ఆగితే వ్యవస్థ పెడదారి

కల్మషం కడుగుతూ సాగింది ఆ నదీ ప్రవాహం

ప్రక్షాళనే లక్ష్యంగా కదలాలి ఉద్యమ సైన్యం

తప్పుని ప్రశ్నించు

దారుణాన్ని ఖండించు

దౌర్జన్యాన్ని నిర్జించు

మంచికై ఉద్యమించు.
                       భగత్ సింగ్

 

చిరుత ప్రాయముననే హృదయమున దేశభక్తిని నింపి

కలనైనా భరతమాత దాస్య సృంఖలాలను మరువక



నిలువునొచ్చి పడిన నీలలోహిత కిరణపు

చురుకుకు చురుకున లేచి చకచక కదిలి

అదరక బెదరక అలుపెరుగక సవ్యసాచై

ఎదురొచ్చిన ఓడ్పులను ఓర్పుతో జయిస్తూ !

 

నింగికెగసిన విశ్వాసంతో, పలుదిక్కుల

పదునెక్కిన మాటలతో, పాతాళాన ఉన్న భావనల్ని

యువత నషాళానికంటించి, పెను ఉప్పెనలా

గర్జించిన సింహంలా, ఓ విప్లవం తెచ్చావు

దుష్టశక్తుల చేత చిక్కి ప్రాణార్పణ చేశావు

భరతజాతి స్వాతంత్ర్య సమర దీపికవయినావు

మన జాతి గుండెల్లో అమరుడవయినావు

 

జోహార్ భగత్ సింగ్ జోహార్ !!