21, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఆధిపత్య ధోరణిమనుగడ కోసం పోరాటం ఎవరయినా సాగించాల్సిందే. దానిని ఎవరూ కాదనరు. చేయకఉండలేరు. ఆ పోరాటం హింసాత్మకం కాదు. మరి మిగతా పోరాటాలు, అంటే నేను చెప్పేది, హక్కుల కోసమై జరిపే పోరాటాలు కాదు, న్యాయం కోసం చేసేవి కాదు, అన్యాయం పై పోరాడేవి కాదు. ఇవన్నీ దాదాపుగా మనుగడ కోసం చేసే పోరాటాల్లో భాగంగానే అభివర్ణించువచ్చు. కానీ నేను మాట్లాడేది ఆధిపత్యపుపోరు. మనుగడ సాఫీగా ఉంటే మరి ఈ ఆధిపత్యపుపోరు అర్ధరహిరతం. ఆధిపత్యం అనే ఆలోచన మనిషి మస్తిష్కంలో ఎందుకు పుడుతుంది?. తన బ్రతుకు తాను బ్రతుకుతూ ఎదుటి వాని పై ఆధిపత్యం ఎందుకు కోరతాడు?. దీనికి కారణం ప్రపంచంలో ఏ దేశమయినా, ఏ ప్రాంతమయినా, ఏ గ్రామమయినా వెతుకు. ఆధిపత్యం కోసం పరితపించని వాడు కనపడడు. ఓ వ్యక్తిపై మరొకడు, ఒక గ్రామం పై మరొక గ్రామం, ఒక దేశం పై ఇంకో దేశం, ఇలా చెప్పుకుంటూ పోతే అంతం లేదు.
ఈ ఆధిపత్యపు పోరు రక్తసిక్తం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణం అని శ్రీశ్రీ గారు చాలా రోజుల క్రితమే చెప్పారు. ఒకరిని మరొకరు పీడించే రోగం ఏమిటి? పీడించి ఏమిటి సాధించేది? ఇది ఒక మానసిక దౌర్భల్యమా? ఒకడిని పీడించి లేదా ఆధిపత్యం సాధించి (వాడిపై) చేసేది ఏమిటి? ఆనందమా? ధనమా? ఇది ఖచ్చితంగా ఒక మానసిక వ్యాధే. గుండె పొరల్లో దాగి ఉన్న పైశాచికాన్ని బహిర్గతము చేసి ఎదుటివానిపై ప్రదర్శించే ప్రక్రియని ఏమంటారు? ముందుగా చెప్పినట్లు ఇది మానసిన వ్యాధే. అవతల వ్యక్తి తన మాట వినాలి, ధిక్కార స్వరం వినిపించ కూడదు, వంగి గులాములు చేయాలి, వీని మాటకు వంత పాడాలి, అప్పుడే వీనికి ఆనందం, అలా జరగకపోతే ఎక్కడ లేని ఆగ్రహం. అవతల వ్యక్తిని చంపేయాలన్న కసి. ఆ కసే ఎంత పనయినా చేయిస్తుంది. ఆధిపత్యం అనే ఆలోచనే ఒక ఉన్మాదం. ఇప్పటిదాకా ఒక వ్యక్తిలో ఆధిపత్యపు ధోరణి యొక్క లక్షణాలను పరిశీలించాం. ఇప్పుడు కొన్నిఉదహరించుకుందాం.
పూర్వం, అంటే చరిత్రలో రాజ్య కాంక్షతో ఎన్నో ప్రాణాలను తీసిన రాజుల గురించి తెలుసుకున్నాం. తన రాజ్యాన్ని విస్తరించడం అనేది ఎమిటి? ఒక రాజ్యం (వేరొక) పై ఆధిపత్యాన్ని సాధించి సామంతులుగా మలచుకోవడం, ఎదురు తిరిగిన మట్టు బెట్టి ఆక్రమించడం. ఇందులో భాగంగా ఎన్ని యుద్ధాలు, ఎన్ని దుశ్చర్యలు, ఎంతమంది సైనికుల ప్రాణార్పణలు. ఎందుకీ రక్తపాతం. ఇలాంటి వాటికి మన చరిత్రలో ఎన్నో ఉదాహరణలు. ఆది మానవ యుగం నుండి ఈ ఆధిపత్యపు పోరు మొదలయినదనే చెప్పుకోవాలి. తీరని రాజ్యకాంక్షతో ఎన్నో యుద్దాలు చేసి ఎంతో మందిని చంపి రక్తశిక్తమయిన కళింగను చూసి హృదయం ద్రవించి బౌద్ద మతాన్ని స్వీకరించిన అశోకుని చరిత్రని ఎవరూ మరువలేం. మరి ఆయన యుద్ధ కాంక్ష, రాజ్య కాంక్ష ఎంత రక్తపాతం సృష్టించింది. చివరికి ఆయన సాధించినది ఏమిటి?
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యమంటూ విర్రవీగి ప్రపంచాన్ని మొత్తం పాలించిన ఆంగ్లేయులు సాధించింది ఎమిటి? ప్రపంచ విజేతగా మిగలాలని యుద్ధాలు సాగించిన అలగ్జాండర్ పొందినది ఎమిటి? చరిత్ర పుటల్లో రక్తాక్షరాలను రాసి వీరు మూట కట్టుకున్నది ఏమిటి? వీరి ఆధిపత్యపు ధోరణులకు బలి అయిన అమాయకులు ఎందరో? ఇంత రక్తపాతం సృష్టించిన వీరి మనసుల్లో ఒక్కసారయినా ఇదంతా ఎందుకు అని అన్పించి ఉండదా? అన్పించినా వీరి ఆలోచనల్ని ఆధిపత్యపు ఆవేశం అణచి ఉంటాయా? ఇంత రక్తపాతానికి వీరి హృదయాలు చలించి ఉండవా? లక్ష్యం ఉండాలి. అది వారి ఉన్నతికై ఉండాలి. ఎదుటి వానిని క్రిందద్రొక్కి తాను పైన నిలవాలనడం ఎంత సమంజసం. ఈ ధోరణి ఎందుకు వస్తుంది?
ఒక రాజరికంలోనే ఈ ధోరణి ఉన్నది అంటే కానే కాదు. ఇది మతోన్మాదం, ప్రాతీయవాదం, కులవాదంలో, వర్ణవ్యవస్థలలోనూ ఉన్నది. నా మతం ఈ ప్రపంచాన్ని పాలించాలి. ఈ ప్రపంచమంతా నిండాలి అనే ధోరణి ఇప్పుడు చూస్తున్నాం. ఇదే ఆధిపత్యపు ధోరణికి నిలువెత్తు నిదర్శనం. కళ్ళ ముందే కనబడుతున్న సత్యం. ఇస్లాం ఈ జగత్తు నిండాలనే ఆశ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఎంత మంది ప్రాణాలను బలితీసుకుంటుందో తెలియంది కాదు. ఒక భారతావనిలోనే కాదు ప్రపంచదేశాలన్నింటిలోనూ ఈ సమస్య రోజు రోజుకూ ఉగ్రరూపం దాలుస్తూనే ఉంది. మనకు మనుగడకు పెను సవాళ్ళను విసురుతూనే ఉంది. ఏ క్షణాన ఎక్కడ విస్ఫోటనం జరుగుతుందో, ఎవడు ఎక్కడ తుపాకి గుండ్లు కురిపిస్తాడో అని ఏక్షణానికాక్షణం భయంతో బ్రతుకుంది ఈ సమాజం. వీరు సాధించేది ఎమిటి? ఇంతమంది ప్రాణాలు తీయమని చెప్పిందా ఆ మత గ్రంధం? ఎందుకు ఈ హింసావాదం? ప్రపంచం అన్ని రంగాలలో ముందుకు పోతుంది అని అనుకుంటే ఇది ఏమిటి? ఈ ఆధిపత్యపు ధోరణి మనల్ని ఎక్కడకు చేరుస్తుంది. మరలా క్రిందకే చేరుస్తుంది.
కుల వాదం, వర్ణ బేధం, ఇవన్నీ కూడా ఆధిపత్యపు ధోరణికే దారి తీస్తున్నాయి. ఒకరి కులంపై మరొకరు, ఒకరి వర్ణంపై మరొకరు, ఇలా పోరాటాలు సాగిస్తూనే ఉంటారు. హిట్లర్ ద్వేషభావం ఎంతమంది యూదులను పొట్టన పెట్టుకుందో ప్రపంచం మరువలేదు. హిట్లర్ నిరంకుశత్వానికి ప్రపంచాన్ని గెలవాలనే ధోరణి జెర్మనీని ఎలా నాశనం చేసిందో అందరికీ తెలుసు. ఆయనగారి నిరంకుశత్వం తెచ్చిన ప్రపంచ యుద్ధాలు ఈ మానవ చరిత్రలోనే మాయని మచ్చలు. నేలను రక్తసిక్తంచేసి చివరికి ఆత్మహత్యకు పాల్పడి ఆయన సాధించింది? లక్షల మంది మరణానికి కారణమయినాడు. నిలువెత్తు భవనాలు, కట్టడాలు ఆటం బాంబులకు నాశనమయిన హిరోషిమా, నాగసాకీ పట్టణాలే దీనికి తార్కాణాలు. ఆ దాడుల తరువాత 30 సంవత్సరములు అక్కడ ఒక పచ్చని మొక్క మొలవలేదు అంటే, అక్కది పిల్లలు తరతరాలు మారినా, దశాబ్దాలు గడచినా ఎదో ఒక లోపంతో జన్మిస్తున్నారంటే దానికి కారణం? హిట్లర్ క్రూరత్వానికి మరో ఉదాహరణ ఆయన నడిపినconcentration camps (Buchenwald (Weimar)) one more near Munich and Auschwitz (Poland). ఇదొక war crime గా ఇప్పటికీ భావిస్తారు. యుద్ధ ఖైదీలను వేలమందిని చిన్న camps లో బంధించి, హింసించి వేలమందికి చావుకు సాక్షాలుగా ఈ ప్రపంచం ముందు నిలిచాయి ఆ కారాగారాలు.
ప్రపంచం చరిత్రలో నియంతలు ఎందరో!! అది వారి ఆధిపత్య ధోరణిని తెలియజేస్తుంది. హిట్లర్, స్టాలిన్, ముస్సోలిని, సద్దాం హుస్సేన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. సద్దాం హుస్సేన్ అకృత్యాలు ఈ ప్రపంచం మరువదు. కొన్ని లక్షల మందిని బలిగొన్నాడు. వీరంతా తాము నాశనమయ్యి తమతోపాటు ఆయా దేశాలను నాశనం చేశారు. ఇంతా వీరు సాధించినది ఏమిటి? సృష్టించినది మాత్రం రక్తపాతం. మానవజాతి యావత్తూ సిగ్గుతో తలవంచుకునే చర్యలకు పాల్పడి ప్రపంచ చరిత్రలో మాయని మచ్చలుగా మిగిలారు.
ఇవి చాలవా? ఆధిపత్యపు ధోరణికి ఉదాహరణలుగా. గమనించినది ఎమిటి? ఎక్కడ చూసినా రక్తపాతమే. ఇప్పుడు అగ్రరాజ్యమంటూ ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచాలని చూస్తున్న ఈ అమెరికాది ఏ ధోరణి? వీరిని ఏమనాలి? ఏ పేరుతో పిలవాలి?
ఇంత రక్తపాతం సృష్టిస్తున్నా ఈ (ఆధిపత్య) మార్గాన్ని మనిషి ఎందుకు కోరుకుంటాడు? ఇన్ని సత్యాలు గమనించినా, చరిత్ర పాఠం చెబుతున్నా, మనిషి ఎందుకు మారడు? పదే పదే ఆ మార్గానే ఎందుకు నడుస్తాడు? ఆ ధోరణిని ఎందుకు వదలలేడు? హింస, రక్తపాతం అనేవి మనిషికి వినోదాన్ని ఇస్తాయా? ఆ మార్గాలు మనిషి మస్తిష్కానికి హాయినిచ్చి సేద దీరుస్తాయా? అవి ఏమయినా మత్తు పదార్ధములా? వాటికి బానిసగామారి బయటకి రాలేకపోతున్నాడా? తెలిసి తెలిసి పదే పదే ఆ మార్గానే ఎందుకు పయనిస్తున్నాడు? సోదరత్వం, ప్రేమభావం పెంచుకొని సాటివాడిని ప్రేమించే రోజులు ఎప్పుడు వస్తాయి? ప్రపంచ శాంతికి తొడ్పడే రోజులు అసలు వస్తాయా? మనిషి ఆలోచనలలో మార్పు రావాలని, వస్తుందని ఆశిస్తూ.....