27, జూన్ 2010, ఆదివారం

ఏమని చెప్పను

మన దేశం ఎంతో గొప్ప చరిత్ర గల దేశం. సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. విభిన్న జాతులు మతాలు కలసి అన్నదమ్ముల్లా బ్రతికిన దేశం. ఈ దేశంలో, ఇళ్ళకు తలుపులేని రోజులు, బంగారం రాశులుగా గా పోసి వీధుల వెంట అమ్మిన స్వర్ణ యుగాలు ఏనాడో పోయాయి. ఇప్పుడు బయటకి వెళితే ఇంటికి తిరిగి వచ్చేదాకా నమ్మకం లేని రోజులు. అవినీతి, హింస, దోపిడీలు, దౌర్జన్యాలు ఇవి మనం నిత్యం చూస్తున్నవి. ఇలాంటి పరిస్థితులలో మన దేశం గురించి ఏమని చెప్పను.

ఏమని చెప్పను నా భరత జాతి గూర్చి!
భేషని చెప్పనా నిజాల్ని ఏమార్ఛి!!

వందలేళ్ళ ఘన చరిత్ర చెబుతూ!
కళ్ళ ముందు నేటిని మాయం చేస్తూ!!
సంస్కృతి, సంస్కారం అంటూ గొప్పలు చెబుతూ!
బ్రష్టాచార, కుసంస్కారాలను వెనుకకు తోస్తూ!!

ఏమని చెప్పను!

విజ్ఞాన ధనులమంటూ విశ్వానికి చాటి చెబుతూ!
నిశానీ బ్రతుకుల సత్యాన్ని పాతర పెడుతూ!!
అపర కుబేరుల లెక్కలు కడుతూ!
ఆకలి కేకలను నొక్కి పడుతూ!!

ఏమని చెప్పను!

భిన్న జాతులు, విభిన్న మతాలంటూ డాబులు చెబుతూ!
అంత కలహాలు, జాతి విభేధాల్లేవని మభ్య పెడుతూ!!
నీతి నిజాయితీలే పునాదులంటూ!
అవినీతికున్న బలాన్ని అణచిపెడుతూ!!

ఏమని చెప్పను!

శాంతికి బుద్దులమంటూ, అహింసకు మహాత్మను చూపుతూ!
అణచలేని హింసాగ్ని జ్వాలలపై నిట్టూర్పుల నీళ్ళు చల్లుతూ!!
స్త్రీని దైవమంటూ లోకానికి చూపుతూ!
నిత్యం జరిగే అత్యాచారాలను ఓ మూలన పెడుతూ!!

ఏమని చెప్పను నా భరత జాతి గూర్చి!
భేషని చెప్పనా నిజాల్ని ఏమార్ఛి!!

ఏమని చెప్పను!
నీతికి రోజులు కావని!
మంచికి మార్గం లేదని!!