27, జూన్ 2010, ఆదివారం

ఏమని చెప్పను

మన దేశం ఎంతో గొప్ప చరిత్ర గల దేశం. సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. విభిన్న జాతులు మతాలు కలసి అన్నదమ్ముల్లా బ్రతికిన దేశం. ఈ దేశంలో, ఇళ్ళకు తలుపులేని రోజులు, బంగారం రాశులుగా గా పోసి వీధుల వెంట అమ్మిన స్వర్ణ యుగాలు ఏనాడో పోయాయి. ఇప్పుడు బయటకి వెళితే ఇంటికి తిరిగి వచ్చేదాకా నమ్మకం లేని రోజులు. అవినీతి, హింస, దోపిడీలు, దౌర్జన్యాలు ఇవి మనం నిత్యం చూస్తున్నవి. ఇలాంటి పరిస్థితులలో మన దేశం గురించి ఏమని చెప్పను.

ఏమని చెప్పను నా భరత జాతి గూర్చి!
భేషని చెప్పనా నిజాల్ని ఏమార్ఛి!!

వందలేళ్ళ ఘన చరిత్ర చెబుతూ!
కళ్ళ ముందు నేటిని మాయం చేస్తూ!!
సంస్కృతి, సంస్కారం అంటూ గొప్పలు చెబుతూ!
బ్రష్టాచార, కుసంస్కారాలను వెనుకకు తోస్తూ!!

ఏమని చెప్పను!

విజ్ఞాన ధనులమంటూ విశ్వానికి చాటి చెబుతూ!
నిశానీ బ్రతుకుల సత్యాన్ని పాతర పెడుతూ!!
అపర కుబేరుల లెక్కలు కడుతూ!
ఆకలి కేకలను నొక్కి పడుతూ!!

ఏమని చెప్పను!

భిన్న జాతులు, విభిన్న మతాలంటూ డాబులు చెబుతూ!
అంత కలహాలు, జాతి విభేధాల్లేవని మభ్య పెడుతూ!!
నీతి నిజాయితీలే పునాదులంటూ!
అవినీతికున్న బలాన్ని అణచిపెడుతూ!!

ఏమని చెప్పను!

శాంతికి బుద్దులమంటూ, అహింసకు మహాత్మను చూపుతూ!
అణచలేని హింసాగ్ని జ్వాలలపై నిట్టూర్పుల నీళ్ళు చల్లుతూ!!
స్త్రీని దైవమంటూ లోకానికి చూపుతూ!
నిత్యం జరిగే అత్యాచారాలను ఓ మూలన పెడుతూ!!

ఏమని చెప్పను నా భరత జాతి గూర్చి!
భేషని చెప్పనా నిజాల్ని ఏమార్ఛి!!

ఏమని చెప్పను!
నీతికి రోజులు కావని!
మంచికి మార్గం లేదని!!

11, జూన్ 2010, శుక్రవారం

ఆకలిదే ఈ గెలుపు

ప్రపంచం ఇంత ముందుకు దూసుక వెళ్తున్నా ఏదో ఓ మూల ఆకలి చావులు మనము చూస్తూనే వున్నాము. ఆకలికి ఓర్వలేక మన్ను తిన్న చేదు నిజాలు మన కళ్ళముందే ఉన్నాయి. ఇటువంటి ఓ సన్నివేశాన్ని వివరించే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాను. దీనిలో " మెతుకుకై పోరాడుతున్న యోధులు" అని వర్ణించుట జరిగింది. ఇది ఈ అంశంలోని లోతుని వ్యక్తపరచడానికి వాడిన పదమే గానీ మరే ఉద్దేశ్యమూ కాదని మనవి.


ఎండిపోయి మొండిబారిన మహావృక్షాలు
నీటి చెమ్మేలేని బీటలు వారిన చెరువులు
పండడానికి పనికి రాని పంట పొలాలు
వర్షపు చినుకుకై ఆకాశం కేసి చూస్తూ అరుస్తున్న జంతుజాలం
వేడి గాలికి నేలపై రాపిడి చేస్తూ ఎగురుతున్న ఎండుటాకులు

కరువు రక్కసి పట్టి పీడిస్తుంటే
క్షామం కాటుకు బలయిన జీవాలు
రక్తం చమటలా ఆవిరై
శరీరం ఎముకల గూడై
గుక్కెడు నీరు కరువై, నాలుక పీకుతుంటే
ఎండిపోయిన ఆ డొక్కలు
ఒక్క మెతుకుకై రోజుల కొద్దీ నిరీక్షిస్తూ
కంటి నీటికి చుక్క కరువై
హ్రుదయం మోనంగా రోదించే ఆ ద్రుశ్యం!

దూరంగా ఓ ఆర్తనాదం!
ఇంతలో ఓ చావుకేక!!

ఒక్క మెతుకుకై నిలువునా ప్రాణం తీసి
తన ప్రాణం నిలుపుకొని బ్రతుకు పోరాటంలో
ఓ నాల్గు రోజులు నిలవడానికి
మనిషిని మనిషి చంపుకొనే ఓ దృశ్యం

ఆకలి కేకలకు మానవత్వం, సోదరత్వం కానరావు.
దానిని అత్యాశ అన్న పేరుతో పిలవలేము
కడుపు నిండి రేపటికి కూడా అంటే అది అత్యాశ
ఒక్క మెతుకుకై ఇక్కడ తన్నుక చస్తుంటే
దాన్ని ఆశ అన్న పేరుతో పిలవడం తప్పే అవుతుంది.

ఆ మెతుకు ప్రాణం నిలిపే సాధనమయితే
దాని సాధనకై పోరాడుతున్న యోధులు వారు
అక్కడ యుద్దం ఏ రాజ్యాధికారం కోసమో కాదు
ధనం కోసమో అసలే కాదు

ఎండుక పోయిన వారి డొక్కలలో
ఆకలి మంటలు రేగి
హృదయంలో రగిలిన జ్వాలలతో
ఉన్న కాస్త రక్తం మరుగుతు ఉంటే
కనబడిన ఆ నాలుగు మెతుకులకై
మనసు పరుగులు పెట్టి చెరువవుతూ
దక్కింది అన్న ఆనందంతో ముందుకు వెళ్తుంటే!
నాల్గు దిక్కుల నుండీ దూసుకొస్తున్న
తనలాంటి నరులనే చూసి నివ్వెరబోయి,
వేగం పెంచి చెయ్యి చాచేలోపే
తన చేయిని దూరంగా తోసే ఓ చేయి
నా నోటి కూడు నీకా అంటూ
గుండె కన్నీరు కారుస్తుంటే
నిరీక్షణ నింపిన ఆవేశంతో
ఆకలి నేర్పిన ఆక్రోశంతో
అందదేమో అన్న ఆవేదనతో
నరనరలా నిత్తేజం ఉత్తేజమై
ఆగ్రహ జ్వాలలతో దూకి
పోరాటం ప్రారంభిస్తే!

మిగిలింది ఏమిటి! ఓ చావు!
అది ఆకలి చావంటావా!
హత్య చేయబడ్డాడంటావా!
యుద్దంలో మరణించాడంటావా!
ఏమంటాము!

మట్టి తింటూ డొక్కలు నింపే
దీనావస్తనుండి నాలుగు మెతుకులకై పోరడిన ఓ ధైర్యమంటావా!
పోరాటంలో గెలువలేక ఓడాడంటావా!
ఇక్కడ గెలిచింది ఎవరు! ఓడింది ఎవరు!

పోరాడిన ఆ అందరిపై ఆకలిదే తుది గెలుపు!
ఆ ఆకలిదే తుది గెలుపు!!!!!!!!!!!!!!!!!!!!!!

6, జూన్ 2010, ఆదివారం

సముద్రం

దూరం నుంచి చూస్తే కనుచూపుమేరలో
భూమంతా తానే ఆవహించి
ఆకాశాన్ని తాకుతు కనిపించింది.!
దగ్గరకు వెళ్ళి నిలబడే లోపే
స్వాగతం అంటూ పాదాలను తాకి పలకరించింది
ఆ స్పర్శ అనుభూతి పొందే లోపే
వచ్చిన దారినే మళ్ళీ వెనక్కి మళ్ళింది.!!

తెలిసిన మిత్రుడిలా పలకరిస్తుంటే
నా మది పులకరించింది.
ఏదో భావం గుండె లోతుల్లో మెదిలింది.
పాదాల క్రింద ఇసుక తెన్నెలపై ఏదో
పిచ్చి రాతలు రాయాలన్న కోరిక కలిగింది.
రాసీ రాయకుండానే నా రాతల్ని
ఇక చాల్లే అంటూ చెరిపి వెళ్ళ్దింది.
ఇలా కవ్విస్తూ, ఊరిస్తూ, ఉడికిస్తూ హడావిడి చేస్తున్న
ఆ సంద్రాన్ని కాసేపు అలాగే పరికించి చూస్తే

అన్ని భావాలూ తనలో దాచుకున్న
అంతుబట్టని ఓ పరిపూర్ణత గోచరిస్తుంది.
తనకు తాను ఆవిరై బీటలు వారిన భూమికి చినుకు స్పర్శనిస్తుంది.
తల్లిలా ఎన్నో జీవాల్ని తన గర్భంలో దాస్తుంది.
పెద్ద దిక్కులా నదులెన్నో తన అక్కున చేర్చుతుంది.
ఎంతో మందికి జీవనోపాధిస్తుంది.
అందరి నోట రుచులను కలిగిస్తుంది.
గర్బంలో దాచిన తైలాన్ని అందిస్తుంది.
లోతుల్లోంచి ముత్యాల ఆభరణాల్ని వెలికితీస్తుంది!

అంతులేని సముద్రపు లోతుల్లో దాగిఉన్న మర్మాలెన్నో
సముద్ర మధ్యం ప్రశాంతం
కానీ తీరమే అలల అలజడులతో హడవిడిగా ఉంటుంది.
గుండెలోతుల్లో ఘోష తీరానికి మాత్రమే వినిపిస్తుంది.
ఆ ఘోషలోని మర్మమేమిటో అంతుపట్టదు.
తాను పైకి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తుంది.

తన గుండెలో ఏ అలజడి ఉందో!
ఎప్పుడూ ఉప్పొంగి తీరాలను ముంచేస్తుందో!
ఆటుపోట్లతో ఎంతమందిని తనలో కలుపుకుంటుందో!
సునామీలా విరుచుకపడి విలయ తాండవం చేస్తుందో!

అన్నీ తనలోనే ఉన్నాయి.
ప్రశాంతత, భీభత్సం, ఆహ్లాదం ,
అందం, అలజడి, గాంభీర్యం,
ఓర్పు, ఓదార్పు, భావం, రాగం!

సముద్రం ఒక అద్బుతం!
సముద్రం ఒక ఆదర్శం!
సముద్రం ఒక పరిపూర్ణం!!