17, నవంబర్ 2010, బుధవారం

గ్రహణం పట్టిన భారతం

స్వతంత్ర భారతికి గ్రహణం పట్టింది!
సువర్ణ భారతి శూన్యమయ్యింది!
అదృష్ట ఆకాశంలో అదృశ్యమయ్యింది!

సూర్య చంద్రులకు రాహుకేతువులయితే
భరత భూమికి రాహు కేతువులెన్నో ఎన్నెన్నో
రాజకీయం, అవినీతి, అరాచకం, ఉగ్రవాదం, మతవాదం!

కపట రాజకీయపు క్రీడలకు చీకట్లు కమ్మి
ఉగ్రవాదం విసురుతున్న పంజాలకు చిక్కి
అవినీతి సర్పం విషం కక్కుతుంటే
అరాచకం పలు దిక్కులా ప్రబలుతుంటే
దేశ ప్రగతి కుంటు పడింది
ప్రజల బ్రతుకు అధోగతి పాలయ్యింది!!

కమ్ముకున్న చీకట్లకు
కనపడని దారులెంట గుడ్డిగా నడుస్తూ
రక్షణే లేని సమాజంలో
బిక్కు బిక్కున బ్రతుకులీడిస్తూ
దగాపడిన సామాన్యుడి బ్రతుకు బండి
ఏ గోతిలో ఇరుక్కుంటుందో
ఇరుసు విరిగి కూల బడుతుందో!!

సూర్య చంద్రుల గ్రహణం కొన్ని గంటలు!
ఈ భరత భూమికి గ్రహణం ఎనాళ్ళో ఎన్నేళ్ళో!!