17, నవంబర్ 2010, బుధవారం

గ్రహణం పట్టిన భారతం

స్వతంత్ర భారతికి గ్రహణం పట్టింది!
సువర్ణ భారతి శూన్యమయ్యింది!
అదృష్ట ఆకాశంలో అదృశ్యమయ్యింది!

సూర్య చంద్రులకు రాహుకేతువులయితే
భరత భూమికి రాహు కేతువులెన్నో ఎన్నెన్నో
రాజకీయం, అవినీతి, అరాచకం, ఉగ్రవాదం, మతవాదం!

కపట రాజకీయపు క్రీడలకు చీకట్లు కమ్మి
ఉగ్రవాదం విసురుతున్న పంజాలకు చిక్కి
అవినీతి సర్పం విషం కక్కుతుంటే
అరాచకం పలు దిక్కులా ప్రబలుతుంటే
దేశ ప్రగతి కుంటు పడింది
ప్రజల బ్రతుకు అధోగతి పాలయ్యింది!!

కమ్ముకున్న చీకట్లకు
కనపడని దారులెంట గుడ్డిగా నడుస్తూ
రక్షణే లేని సమాజంలో
బిక్కు బిక్కున బ్రతుకులీడిస్తూ
దగాపడిన సామాన్యుడి బ్రతుకు బండి
ఏ గోతిలో ఇరుక్కుంటుందో
ఇరుసు విరిగి కూల బడుతుందో!!

సూర్య చంద్రుల గ్రహణం కొన్ని గంటలు!
ఈ భరత భూమికి గ్రహణం ఎనాళ్ళో ఎన్నేళ్ళో!!

4, ఆగస్టు 2010, బుధవారం

లోకం తీరు

గెలుపు బాటలో పయనిస్తుంటే నీ వెంటే మేమన్నారు!
కాస్త తడబడితే దూరంగా ఆగి చూసారు!
ఓటమికి చేరువవుతుంటే ఒంటరిని చేసి దోషాల్ని వెతికారు!

ఇది లోకం తీరు!

కాసేపు అలసి కూర్చుంటే పోరాడే గుణం లేదన్నారు!
నిదానంగా అడుగులేస్తుంటే ఈ వేగం చాలదన్నారు!
పోనీలే అని పరుగు తీస్తే అంత దూకుడు తగదన్నారు!
ఇక నా వల్ల కాదంటూ సాయం కోరితే పలుకక మిన్నకున్నారు!
ఇంకాస్త బ్రతిమి లాడితే తలోదారి చూసుకున్నరు!

ఇది లోకం తీరు!

నీతికివి రోజులు కావన్నారు!
న్యాయం బ్రతకలేదన్నారు!
శాంతి కనుమరుగయ్యిందని వాపోయారు!
కళ్ళ ముందు గలాటాని చూసి పక్కకి తప్పుకున్నారు!
నా కెందుకొచ్చిన గొడవంటూ ఇంటి తలుపు మూసుకున్నారు!

ఇది లోకం తీరు!

మానవత్వం అని మాటలు చెప్పారు!
ప్రేమ చూపాలని ప్రభోధాలు పల్కారు!
జాలి వుండాలని నినాదాలూ చేసారు!
బ్రతుకు బాటలో గతి తప్పిన జీవాల్ని చూసి నవ్వుకున్నారు!
సాయం కోరితే విసుకున్నారు!

ఇది లోకం తీరు!!

17, జులై 2010, శనివారం

కవిని

కవినోయి నేను కవిని!

రవిని, శశిని, నిశిని
కలిపివేయగల ఋషిని!

కవినోయి నేను కవిని!

మనిషిని,మనసుని
కలల్ని,నిజాల్ని
నమ్మకాన్ని,వాస్తవాన్ని
జోడించి చెప్పగల మానసిక శాస్త్రజ్ఞుడ్ని!

కవినోయి నేను కవిని!

వేదాన్ని, జీవిత సారాన్ని
అంతులేని మర్మాన్ని
వివరించే వేదాంతిని!

కవినోయి నేను కవిని!

చీకటికి రంగులు అద్దగల చిత్రకారుడ్ని
క్షణంలో వయ్యారులను సృష్టించగల శిల్పిని

కవినోయి నేను కవిని!

కలాన్ని పొలం బాట పట్టిస్తాను
పదాల్ని కవాతులు చేయిస్తాను
పంచభూతాల్ని స్పృశిస్తాను
చతుర్వేదాల్ని వల్లిస్తాను
కోయిల గానాన్ని ఆలకిస్తాను
సప్తస్వరాల్ని పలికిస్తాను!

కవినోయి నేను కవిని!

విప్లవ శంఖం పూరిస్తాను
వెన్నెల హాయి కురిపిస్తాను
సుఖంలో హాయినవుతాను
దుఖంలో ఓదార్పునవుతాను
విహంగంలా విహరిస్తాను
సముద్రపు లోతులకు చేరతాను!

కవినోయి నేను కవిని!

ఏ జాతినైనా ఆదరిస్తాను
ఏ మతాన్నైనా ఆచరిస్తాను
దేశ దేశాల సంచరిస్తాను
మనిషి మనిషిని పలకరిస్తాను
మనసు మనసుని తాకి వస్తాను!

కవినోయి నేను కవిని!

తత్వాన్ని చెబుతాను
సత్యాన్ని ప్రభోధిస్తాను
నిజానికి కాపు కాస్తాను
అవినీతిపై యుద్దం చేస్తాను!

కవినోయి నేను కవిని!

కార్మికుడి కష్టంలో నేనే
శ్రామికుడి స్వేదంలో నేనే
ఆకలిలో నేనే
ఆవేశంలో నేనే
అంతరంగంలో నేనే
గళంలో నేనే
పేదవాడి ఆవేదనలో నేనే
ధనికుడి అహంలో నేనే!

కవినోయి నేను కవిని!

27, జూన్ 2010, ఆదివారం

ఏమని చెప్పను

మన దేశం ఎంతో గొప్ప చరిత్ర గల దేశం. సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. విభిన్న జాతులు మతాలు కలసి అన్నదమ్ముల్లా బ్రతికిన దేశం. ఈ దేశంలో, ఇళ్ళకు తలుపులేని రోజులు, బంగారం రాశులుగా గా పోసి వీధుల వెంట అమ్మిన స్వర్ణ యుగాలు ఏనాడో పోయాయి. ఇప్పుడు బయటకి వెళితే ఇంటికి తిరిగి వచ్చేదాకా నమ్మకం లేని రోజులు. అవినీతి, హింస, దోపిడీలు, దౌర్జన్యాలు ఇవి మనం నిత్యం చూస్తున్నవి. ఇలాంటి పరిస్థితులలో మన దేశం గురించి ఏమని చెప్పను.

ఏమని చెప్పను నా భరత జాతి గూర్చి!
భేషని చెప్పనా నిజాల్ని ఏమార్ఛి!!

వందలేళ్ళ ఘన చరిత్ర చెబుతూ!
కళ్ళ ముందు నేటిని మాయం చేస్తూ!!
సంస్కృతి, సంస్కారం అంటూ గొప్పలు చెబుతూ!
బ్రష్టాచార, కుసంస్కారాలను వెనుకకు తోస్తూ!!

ఏమని చెప్పను!

విజ్ఞాన ధనులమంటూ విశ్వానికి చాటి చెబుతూ!
నిశానీ బ్రతుకుల సత్యాన్ని పాతర పెడుతూ!!
అపర కుబేరుల లెక్కలు కడుతూ!
ఆకలి కేకలను నొక్కి పడుతూ!!

ఏమని చెప్పను!

భిన్న జాతులు, విభిన్న మతాలంటూ డాబులు చెబుతూ!
అంత కలహాలు, జాతి విభేధాల్లేవని మభ్య పెడుతూ!!
నీతి నిజాయితీలే పునాదులంటూ!
అవినీతికున్న బలాన్ని అణచిపెడుతూ!!

ఏమని చెప్పను!

శాంతికి బుద్దులమంటూ, అహింసకు మహాత్మను చూపుతూ!
అణచలేని హింసాగ్ని జ్వాలలపై నిట్టూర్పుల నీళ్ళు చల్లుతూ!!
స్త్రీని దైవమంటూ లోకానికి చూపుతూ!
నిత్యం జరిగే అత్యాచారాలను ఓ మూలన పెడుతూ!!

ఏమని చెప్పను నా భరత జాతి గూర్చి!
భేషని చెప్పనా నిజాల్ని ఏమార్ఛి!!

ఏమని చెప్పను!
నీతికి రోజులు కావని!
మంచికి మార్గం లేదని!!

11, జూన్ 2010, శుక్రవారం

ఆకలిదే ఈ గెలుపు

ప్రపంచం ఇంత ముందుకు దూసుక వెళ్తున్నా ఏదో ఓ మూల ఆకలి చావులు మనము చూస్తూనే వున్నాము. ఆకలికి ఓర్వలేక మన్ను తిన్న చేదు నిజాలు మన కళ్ళముందే ఉన్నాయి. ఇటువంటి ఓ సన్నివేశాన్ని వివరించే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాను. దీనిలో " మెతుకుకై పోరాడుతున్న యోధులు" అని వర్ణించుట జరిగింది. ఇది ఈ అంశంలోని లోతుని వ్యక్తపరచడానికి వాడిన పదమే గానీ మరే ఉద్దేశ్యమూ కాదని మనవి.


ఎండిపోయి మొండిబారిన మహావృక్షాలు
నీటి చెమ్మేలేని బీటలు వారిన చెరువులు
పండడానికి పనికి రాని పంట పొలాలు
వర్షపు చినుకుకై ఆకాశం కేసి చూస్తూ అరుస్తున్న జంతుజాలం
వేడి గాలికి నేలపై రాపిడి చేస్తూ ఎగురుతున్న ఎండుటాకులు

కరువు రక్కసి పట్టి పీడిస్తుంటే
క్షామం కాటుకు బలయిన జీవాలు
రక్తం చమటలా ఆవిరై
శరీరం ఎముకల గూడై
గుక్కెడు నీరు కరువై, నాలుక పీకుతుంటే
ఎండిపోయిన ఆ డొక్కలు
ఒక్క మెతుకుకై రోజుల కొద్దీ నిరీక్షిస్తూ
కంటి నీటికి చుక్క కరువై
హ్రుదయం మోనంగా రోదించే ఆ ద్రుశ్యం!

దూరంగా ఓ ఆర్తనాదం!
ఇంతలో ఓ చావుకేక!!

ఒక్క మెతుకుకై నిలువునా ప్రాణం తీసి
తన ప్రాణం నిలుపుకొని బ్రతుకు పోరాటంలో
ఓ నాల్గు రోజులు నిలవడానికి
మనిషిని మనిషి చంపుకొనే ఓ దృశ్యం

ఆకలి కేకలకు మానవత్వం, సోదరత్వం కానరావు.
దానిని అత్యాశ అన్న పేరుతో పిలవలేము
కడుపు నిండి రేపటికి కూడా అంటే అది అత్యాశ
ఒక్క మెతుకుకై ఇక్కడ తన్నుక చస్తుంటే
దాన్ని ఆశ అన్న పేరుతో పిలవడం తప్పే అవుతుంది.

ఆ మెతుకు ప్రాణం నిలిపే సాధనమయితే
దాని సాధనకై పోరాడుతున్న యోధులు వారు
అక్కడ యుద్దం ఏ రాజ్యాధికారం కోసమో కాదు
ధనం కోసమో అసలే కాదు

ఎండుక పోయిన వారి డొక్కలలో
ఆకలి మంటలు రేగి
హృదయంలో రగిలిన జ్వాలలతో
ఉన్న కాస్త రక్తం మరుగుతు ఉంటే
కనబడిన ఆ నాలుగు మెతుకులకై
మనసు పరుగులు పెట్టి చెరువవుతూ
దక్కింది అన్న ఆనందంతో ముందుకు వెళ్తుంటే!
నాల్గు దిక్కుల నుండీ దూసుకొస్తున్న
తనలాంటి నరులనే చూసి నివ్వెరబోయి,
వేగం పెంచి చెయ్యి చాచేలోపే
తన చేయిని దూరంగా తోసే ఓ చేయి
నా నోటి కూడు నీకా అంటూ
గుండె కన్నీరు కారుస్తుంటే
నిరీక్షణ నింపిన ఆవేశంతో
ఆకలి నేర్పిన ఆక్రోశంతో
అందదేమో అన్న ఆవేదనతో
నరనరలా నిత్తేజం ఉత్తేజమై
ఆగ్రహ జ్వాలలతో దూకి
పోరాటం ప్రారంభిస్తే!

మిగిలింది ఏమిటి! ఓ చావు!
అది ఆకలి చావంటావా!
హత్య చేయబడ్డాడంటావా!
యుద్దంలో మరణించాడంటావా!
ఏమంటాము!

మట్టి తింటూ డొక్కలు నింపే
దీనావస్తనుండి నాలుగు మెతుకులకై పోరడిన ఓ ధైర్యమంటావా!
పోరాటంలో గెలువలేక ఓడాడంటావా!
ఇక్కడ గెలిచింది ఎవరు! ఓడింది ఎవరు!

పోరాడిన ఆ అందరిపై ఆకలిదే తుది గెలుపు!
ఆ ఆకలిదే తుది గెలుపు!!!!!!!!!!!!!!!!!!!!!!

6, జూన్ 2010, ఆదివారం

సముద్రం

దూరం నుంచి చూస్తే కనుచూపుమేరలో
భూమంతా తానే ఆవహించి
ఆకాశాన్ని తాకుతు కనిపించింది.!
దగ్గరకు వెళ్ళి నిలబడే లోపే
స్వాగతం అంటూ పాదాలను తాకి పలకరించింది
ఆ స్పర్శ అనుభూతి పొందే లోపే
వచ్చిన దారినే మళ్ళీ వెనక్కి మళ్ళింది.!!

తెలిసిన మిత్రుడిలా పలకరిస్తుంటే
నా మది పులకరించింది.
ఏదో భావం గుండె లోతుల్లో మెదిలింది.
పాదాల క్రింద ఇసుక తెన్నెలపై ఏదో
పిచ్చి రాతలు రాయాలన్న కోరిక కలిగింది.
రాసీ రాయకుండానే నా రాతల్ని
ఇక చాల్లే అంటూ చెరిపి వెళ్ళ్దింది.
ఇలా కవ్విస్తూ, ఊరిస్తూ, ఉడికిస్తూ హడావిడి చేస్తున్న
ఆ సంద్రాన్ని కాసేపు అలాగే పరికించి చూస్తే

అన్ని భావాలూ తనలో దాచుకున్న
అంతుబట్టని ఓ పరిపూర్ణత గోచరిస్తుంది.
తనకు తాను ఆవిరై బీటలు వారిన భూమికి చినుకు స్పర్శనిస్తుంది.
తల్లిలా ఎన్నో జీవాల్ని తన గర్భంలో దాస్తుంది.
పెద్ద దిక్కులా నదులెన్నో తన అక్కున చేర్చుతుంది.
ఎంతో మందికి జీవనోపాధిస్తుంది.
అందరి నోట రుచులను కలిగిస్తుంది.
గర్బంలో దాచిన తైలాన్ని అందిస్తుంది.
లోతుల్లోంచి ముత్యాల ఆభరణాల్ని వెలికితీస్తుంది!

అంతులేని సముద్రపు లోతుల్లో దాగిఉన్న మర్మాలెన్నో
సముద్ర మధ్యం ప్రశాంతం
కానీ తీరమే అలల అలజడులతో హడవిడిగా ఉంటుంది.
గుండెలోతుల్లో ఘోష తీరానికి మాత్రమే వినిపిస్తుంది.
ఆ ఘోషలోని మర్మమేమిటో అంతుపట్టదు.
తాను పైకి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తుంది.

తన గుండెలో ఏ అలజడి ఉందో!
ఎప్పుడూ ఉప్పొంగి తీరాలను ముంచేస్తుందో!
ఆటుపోట్లతో ఎంతమందిని తనలో కలుపుకుంటుందో!
సునామీలా విరుచుకపడి విలయ తాండవం చేస్తుందో!

అన్నీ తనలోనే ఉన్నాయి.
ప్రశాంతత, భీభత్సం, ఆహ్లాదం ,
అందం, అలజడి, గాంభీర్యం,
ఓర్పు, ఓదార్పు, భావం, రాగం!

సముద్రం ఒక అద్బుతం!
సముద్రం ఒక ఆదర్శం!
సముద్రం ఒక పరిపూర్ణం!!

10, ఏప్రిల్ 2010, శనివారం

కవులు కళాకారులు

"కవులు కళాకారులు మానవాళికి సంసృతిని నేర్పారు - లేకుంటే మనుష్యులు ఒకరిని ఒకరు వేటాడుకొని జంతువులకన్నా హీనంగా ప్రవర్తిస్తుండే వారే" అని గుంటూరి శేషేంద్ర శర్మ గారు చేప్పారు. అవును నిజమే కదా.
ఆవేశం, పరనింద, అత్యాశ, లోభితనం, కామం, అసత్యం, ఇలా ఎన్నో దుర్లక్షణాలు మన సమాజంలో చూస్తూ ఉన్నాము. మనలో కూడా వీటిల్లో కొన్ని లక్షణాలు వున్నాయి. మన కవులు, కళాకారులు మనకు ఎన్నో రకాలుగా వీటివల్ల నష్టాలను చెబుతూ వచ్చారు. పురాణాలలో సత్యాన్ని గమనిస్తే భొధపడేది ఈ విషయాలే. వాటిల్లో ఈ కవులు కొన్ని పాత్రలను సృష్టించి, ఆయా పాత్రలకు వివిధ రకములయిన లక్షణములను జోడించి, వాటికి అణుగుణముగా కధను లేదా కవితను నడిపి చివరికి ఆ లక్షణ ప్రభావం ఆ పాత్రను ఏ స్తాయికి తీసుకవెడుతుందో కళ్ళముందు చూపినట్లుగా రాశారు. వాటిని కళాకారులు ప్రదర్శించి ఆయా పాత్రల లక్షణాలను, వాటివల్ల సంభవించే పరిణామాలను జనం ముందుకు తెచ్చారు. ఆయా పాత్రలు, వాటి లక్షణాలను ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచి పోయేలా చేశారు. సాధువులు, మునులు ధర్మ ప్రచారం చేస్తూ వీటిని ప్రచారం సాగించారు. అందువల్లే ఓ కామాంధుడ్ని కీచకుడనో, లేక రావణుడనో అంటాం. అసూయలకు, పదవీ వ్యామోహములకు భారతంలో ధుర్యోధనుని పాత్రను, ధర్మానికి ధర్మరాజు, సత్యానికి హరిశ్చంద్రుడు, దానానికి కర్ణుడు, శిబి పాత్రలు తార్కాణాలుగా నిలుస్తాయి. మనిషి లోని ప్రతి లక్షణానికి మన పురణాలలో, కావ్యాలలో ఏదో ఒక పాత్ర మన ఊహలలో నిలుస్తుంది. గోరుముద్దలు పెడుతూ తల్లి పిల్లవాడికి ఏదో ఒక పాత్రను సృష్టించి కధ చెబుతుంటేకానీ ఆ పిల్లవాడు ముద్ద తినడు. మంచి చెబుతూ కూడా ఏదో ఒక పురాణంలో ఒక పాత్ర ఔచిత్యాన్ని వాడి అవగాహన కోసం ఉదహరిస్తుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కాబట్టి అవి ఎంతగా ప్రభావం చూపాయో చూసాముగా. ఈ కళలు సమాజానికి ఎంతో కొంత మేలు చేశాయని మరలా మరలా చెప్పనవసరం లేదు.

31, మార్చి 2010, బుధవారం

మార్పు మనలో రావాలి

ఈ వ్యవస్త లో మార్పు రావాలి, అవినీతిని అంత మొందించాలి అంటూ, ఈ అవినీతికి అంతా రాజకీయ నాయకులను మరియు ప్రభుత్వ ఉద్యోగులనే భాద్యులను చేస్తూ నిందించడం మనం నిత్యం చేసే పని. అరె, వ్యవస్త అంటే ఏమిటి?. మనమే కదా. మనలో మార్పు వస్తే వ్యవస్త అదే బాగు పడుటుంది. ఆ రాజకీయ నాయకుడెవరు?. మనం ఎన్నుకున్నవాడే కదా. ఇంత తెలిసి కూడా అవినీతి పరుడ్ని ఎందుకు ఎన్నుకున్నావు?. నీవేదో దేశాన్ని ఉద్దరిస్తున్న వాడిలా, అవినీతంతా రాజకీయ నాయకులో లేదా ప్రభుత్వ ఉద్యోగులో చెస్తున్నట్లు మాట్లాడడం సబబు కాదు. అవినీతి మన అందరిలో ఉంది. మనకు ప్రతినిధులుగా కొందరిని ఎన్నుకుంటున్నావు. వాడు నీలోని అవినీతికి ప్రతిబింబమే. ఐతే వాడి నుండి నీవు నీతిని ఎలా కోరుకుంటావు. అలా కోరుకోవడమూ అవినీతతే.

మనలోనే మార్పు రావాలన్న విషయానికి చిన్నగా వద్దాం. మొదట రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు (ఓటు) గురించి మాట్లాడుకుందాం. అసలు మనము ఓటు ఎందుకు వేస్తున్నాము. అది మాత్రం ఆలోచించం. మన ఓటు కున్న ప్రాముఖ్యత ఏంత అన్నది మనకు తెలియదు. ఎవరికి అధికారం అందిస్తున్నాము. వాడు అసలు అర్హుడేనా అన్న విషయం ఆలోచించం. రాబోయే ఐదేళ్ళ లో మన దిశను, గమనాన్ని, అభివృద్దిని నిర్దేశించగల ఆయుధం ఓటు అని, అది తమకు తాముగా ఆలోచించుకొని విచక్షణ తో మంచి వ్యక్తిని ఎంపిక చేసుకొని, ఆ వ్యక్తికే తమ పవిత్రమైన ఆ ఓటు ను వెయ్యాలని ఎంత మందిలో అవగాహన ఉంది. ఒక్కసారి పొరబాటు చేస్తే దానికి ఐదు వర్షాలు మనం శిక్ష అనుభవించాలని, వారి వల్ల దేశం మరో పది సంవత్సరాలు వెనక్కి వెలుతుందని ఆలోచనే చెయ్యరు. అది వారి ఊహ లోకే రాదు. కొనే 50 రూపాయల వస్తువు గురించి వందసార్లు ఆలోచించే మనం కొన్ని వేల కోట్లను ప్రజలకు వినియోగించడానికి ఓ ప్రతినిధిని ఎన్నుకొనే విషయంలో ఓ క్షణం ఎందుకు ఆలోచించము. దేశం నాశనం ఐనా పర్వాలేదా. స్వాతంత్ర దినోత్సవం నాడో, గణతంత్ర దినోత్సవం నాడో తప్పితే దేశం ఇంకోసారి గుర్తుకు రాదా.

ఆ అభ్యర్థి పంచే 500 రూపాయల నోటుకో, లేక వాడిచ్చే సారా పొట్లాం కో సలాం కొట్టి గులాం అవుతున్నడే కానీ, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకోడు. అరే వీరికి విచక్షణ లేదా. ఇంత గెలవడానికి ఖర్ఛు పెట్టిన వాడు, తరువాత మన సొమ్మే అంతకు అంత దోచుక తింటాడన్న జ్ఞానం లేదా?. రాజకీయం ఓ వ్యాపారం ఐనది. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టడం. ఇదేళ్ళ లో పదింతల లాభం ఆర్జించడం. నష్ట పోతున్నదెవరు. వాడిని గెలిపించిన వాడేగా?.

డబ్బు తీసుకొని ఓటు వేసే సంస్క్సతి నీఛం. మన తల రాతను మనమే రాయగల అవకాశాన్ని వదులుకొని అవినీతికి పాల్పడి, ఓ అల్పుడను గద్దెనెక్కించి దేశ భవిష్యత్తును నిర్దేశించే అత్యున్నతమైన ఆ ఆలయానికి పంపడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఓటును డబ్బులిచ్చి కొన్న వాడు ప్రజాప్రతినిధి ఎలా అవుతాడు. మన మనసుల్ని గెలువక మనుషుల్ని కొన్నవాడు నాయకుడెలా అవుతాడు. వాడు వ్యాపారి. ఇవ్వాల కొన్నవాడు, రేపు మన ఆత్మాభిమానాలను అంగట్లో బేరానికి పెడతాడు. అంతా అయిన తరువాత నీకు ప్రశ్నించే హక్కు ఉండదు. ఎందుకంటే దానిలో నీవు కూడా భాగస్వామివే. నీలో రీతిని, నీలో అవినీతిని నీ ప్రతినిధిగా నీవు ఎన్నుకున్నావు. ఇక ప్రశ్నించే ఆలోచన నీ కెప్పటికి వస్తుంది. నిన్ను నీవు ప్రశ్నించు కోగలిగే స్థాయి ఉంటే నీవు ఇలా ఎలా ఆలోచిస్తావు.

ప్రజల మనసుల్లోని ఆలోచనల ప్రతిబింబమేనండీ ఆ ప్రజాప్రతినిధుల సభ. నీ ఆలోచన సరిగ్గా వుంటే అది అంత పవిత్రంగా ఉంటుంది. మన ఆలోచనలు ఇలా ఉంటే వాటి ప్రతిబింబం గొప్పగా, ఆదర్శ వంతంగా ఎందుకు ఉంటుంది

ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి, ఈ దేశాన్ని, వ్యవస్థని మార్చాలి అని మాటలు చెబుతూ కాలం వెల్లబుచ్చుతాం. ఎవరో ఎందుకు వస్తారు. మన లోనే మార్పు రావాలి. మనం నిజాయితీ గా ఉందాం. ఏ అవినీతికి పాల్పడకుండా వుందాం. ఆరాచకాన్ని సృష్టించద్దు. సభ్య సమాజం గర్వపడే వ్యక్తిగా ఎదుగుదాం. మనల్ని మనం సరి చేసుకుందాం. అందరం అలా ఉంటే అదే మార్పు. మార్పు ఎవరో బలవంతానో, చమత్కారంగానో తేజాలరు. మనకు మనంగా అనుసరించి అనుభవించాలి.

ఎవరికి వారు మునిసిపాలిటి వారొస్తారుగా అని ఇళ్ళ ముందే చెత్త వేస్తే ఆ వీధంతా దుర్గంధం అవుతుంది. అదే ఎవరికి వారు భాధ్యతతో ఆ వీధి చివర ఉన్న చెత్త కుండీలో వేస్తే వీధి శుభ్రంగా ఉంటుంది. ఎవరికి వారు తమంతట తాము ఆలోచించి అలవరుచుకోవాలి. ఇలా ఏ అంశం అయినా, ఏ విషయయినా ఆలోచిస్తే మార్పు తప్పని సరిగా వస్తుంది. మనందరం గర్వపడే సమాజాన్ని, దేశాన్ని మనమే నిర్మించుకోవచ్చు. అభివృద్ది చెందాలన్నా, అణగారి పొవడమయినా అంతా మన చేతుల్లోనే ఉంది.

కాబట్టి మార్పు మన ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో రావాలి. ఆలోచనల్నిఅభ్యుదయం లోకి నడిపించి అభివృద్దికి మనం పునాది వెయ్యాలి. ఎవడూ గొప్పవాడు కాదు. ఎవడూ దుర్మార్గుడు కాదు. మనసును సన్మార్గంలో నడిపిస్తే మార్పు సహజంగా వస్తుంది. ఆ మార్పునే మనం కోరుకుందాం. ఎవరో మార్ఛాలని ఆశించద్దు. మనకు మనం అలోచిద్దాం, ఆచరిద్దాం. నోటు రాజకీయాలను మనసుల నుండి చెరిపేసి అభ్యుదయాన్ని పాటిస్తూ, అభివృద్దిని కోరుకుందాం. ఆదర్శవంతుడ్ని మన ప్రతినిధిగా ఎన్నుకుందాం.

14, మార్చి 2010, ఆదివారం

కనులు - మనసు

కనులు రెప్పల చాటున దాగినంత మాత్రాన
మనసు వీక్షించడం మానదు!

రెప్పగారి అనుమతి కనులకు లభించినా
మనసుని మైకం నుండి మరల్చలేవు!

అసత్యం కనులను భ్రమింప జేసినా
మనసు తలుపులను తెరువజాలదు!

సున్నితత్వం కనులకు కానరాక పోయినా
మనసు ఆహ్వానం పొందక మానదు!

తీక్షణ వెలుగు రేఖలను కనులు తాళలేకున్నా
మనసు వాకిట ఆ రేఖలే ముగ్గులాయేను!

నిశరేతిరి కనులకు చీకట్లు నింపినా
మనసు లోతుల్లొ హాయి అనే వెలుగులు నింపేను!!

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఆధిపత్య ధోరణిమనుగడ కోసం పోరాటం ఎవరయినా సాగించాల్సిందే. దానిని ఎవరూ కాదనరు. చేయకఉండలేరు. ఆ పోరాటం హింసాత్మకం కాదు. మరి మిగతా పోరాటాలు, అంటే నేను చెప్పేది, హక్కుల కోసమై జరిపే పోరాటాలు కాదు, న్యాయం కోసం చేసేవి కాదు, అన్యాయం పై పోరాడేవి కాదు. ఇవన్నీ దాదాపుగా మనుగడ కోసం చేసే పోరాటాల్లో భాగంగానే అభివర్ణించువచ్చు. కానీ నేను మాట్లాడేది ఆధిపత్యపుపోరు. మనుగడ సాఫీగా ఉంటే మరి ఈ ఆధిపత్యపుపోరు అర్ధరహిరతం. ఆధిపత్యం అనే ఆలోచన మనిషి మస్తిష్కంలో ఎందుకు పుడుతుంది?. తన బ్రతుకు తాను బ్రతుకుతూ ఎదుటి వాని పై ఆధిపత్యం ఎందుకు కోరతాడు?. దీనికి కారణం ప్రపంచంలో ఏ దేశమయినా, ఏ ప్రాంతమయినా, ఏ గ్రామమయినా వెతుకు. ఆధిపత్యం కోసం పరితపించని వాడు కనపడడు. ఓ వ్యక్తిపై మరొకడు, ఒక గ్రామం పై మరొక గ్రామం, ఒక దేశం పై ఇంకో దేశం, ఇలా చెప్పుకుంటూ పోతే అంతం లేదు.
ఈ ఆధిపత్యపు పోరు రక్తసిక్తం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణం అని శ్రీశ్రీ గారు చాలా రోజుల క్రితమే చెప్పారు. ఒకరిని మరొకరు పీడించే రోగం ఏమిటి? పీడించి ఏమిటి సాధించేది? ఇది ఒక మానసిక దౌర్భల్యమా? ఒకడిని పీడించి లేదా ఆధిపత్యం సాధించి (వాడిపై) చేసేది ఏమిటి? ఆనందమా? ధనమా? ఇది ఖచ్చితంగా ఒక మానసిక వ్యాధే. గుండె పొరల్లో దాగి ఉన్న పైశాచికాన్ని బహిర్గతము చేసి ఎదుటివానిపై ప్రదర్శించే ప్రక్రియని ఏమంటారు? ముందుగా చెప్పినట్లు ఇది మానసిన వ్యాధే. అవతల వ్యక్తి తన మాట వినాలి, ధిక్కార స్వరం వినిపించ కూడదు, వంగి గులాములు చేయాలి, వీని మాటకు వంత పాడాలి, అప్పుడే వీనికి ఆనందం, అలా జరగకపోతే ఎక్కడ లేని ఆగ్రహం. అవతల వ్యక్తిని చంపేయాలన్న కసి. ఆ కసే ఎంత పనయినా చేయిస్తుంది. ఆధిపత్యం అనే ఆలోచనే ఒక ఉన్మాదం. ఇప్పటిదాకా ఒక వ్యక్తిలో ఆధిపత్యపు ధోరణి యొక్క లక్షణాలను పరిశీలించాం. ఇప్పుడు కొన్నిఉదహరించుకుందాం.
పూర్వం, అంటే చరిత్రలో రాజ్య కాంక్షతో ఎన్నో ప్రాణాలను తీసిన రాజుల గురించి తెలుసుకున్నాం. తన రాజ్యాన్ని విస్తరించడం అనేది ఎమిటి? ఒక రాజ్యం (వేరొక) పై ఆధిపత్యాన్ని సాధించి సామంతులుగా మలచుకోవడం, ఎదురు తిరిగిన మట్టు బెట్టి ఆక్రమించడం. ఇందులో భాగంగా ఎన్ని యుద్ధాలు, ఎన్ని దుశ్చర్యలు, ఎంతమంది సైనికుల ప్రాణార్పణలు. ఎందుకీ రక్తపాతం. ఇలాంటి వాటికి మన చరిత్రలో ఎన్నో ఉదాహరణలు. ఆది మానవ యుగం నుండి ఈ ఆధిపత్యపు పోరు మొదలయినదనే చెప్పుకోవాలి. తీరని రాజ్యకాంక్షతో ఎన్నో యుద్దాలు చేసి ఎంతో మందిని చంపి రక్తశిక్తమయిన కళింగను చూసి హృదయం ద్రవించి బౌద్ద మతాన్ని స్వీకరించిన అశోకుని చరిత్రని ఎవరూ మరువలేం. మరి ఆయన యుద్ధ కాంక్ష, రాజ్య కాంక్ష ఎంత రక్తపాతం సృష్టించింది. చివరికి ఆయన సాధించినది ఏమిటి?
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యమంటూ విర్రవీగి ప్రపంచాన్ని మొత్తం పాలించిన ఆంగ్లేయులు సాధించింది ఎమిటి? ప్రపంచ విజేతగా మిగలాలని యుద్ధాలు సాగించిన అలగ్జాండర్ పొందినది ఎమిటి? చరిత్ర పుటల్లో రక్తాక్షరాలను రాసి వీరు మూట కట్టుకున్నది ఏమిటి? వీరి ఆధిపత్యపు ధోరణులకు బలి అయిన అమాయకులు ఎందరో? ఇంత రక్తపాతం సృష్టించిన వీరి మనసుల్లో ఒక్కసారయినా ఇదంతా ఎందుకు అని అన్పించి ఉండదా? అన్పించినా వీరి ఆలోచనల్ని ఆధిపత్యపు ఆవేశం అణచి ఉంటాయా? ఇంత రక్తపాతానికి వీరి హృదయాలు చలించి ఉండవా? లక్ష్యం ఉండాలి. అది వారి ఉన్నతికై ఉండాలి. ఎదుటి వానిని క్రిందద్రొక్కి తాను పైన నిలవాలనడం ఎంత సమంజసం. ఈ ధోరణి ఎందుకు వస్తుంది?
ఒక రాజరికంలోనే ఈ ధోరణి ఉన్నది అంటే కానే కాదు. ఇది మతోన్మాదం, ప్రాతీయవాదం, కులవాదంలో, వర్ణవ్యవస్థలలోనూ ఉన్నది. నా మతం ఈ ప్రపంచాన్ని పాలించాలి. ఈ ప్రపంచమంతా నిండాలి అనే ధోరణి ఇప్పుడు చూస్తున్నాం. ఇదే ఆధిపత్యపు ధోరణికి నిలువెత్తు నిదర్శనం. కళ్ళ ముందే కనబడుతున్న సత్యం. ఇస్లాం ఈ జగత్తు నిండాలనే ఆశ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఎంత మంది ప్రాణాలను బలితీసుకుంటుందో తెలియంది కాదు. ఒక భారతావనిలోనే కాదు ప్రపంచదేశాలన్నింటిలోనూ ఈ సమస్య రోజు రోజుకూ ఉగ్రరూపం దాలుస్తూనే ఉంది. మనకు మనుగడకు పెను సవాళ్ళను విసురుతూనే ఉంది. ఏ క్షణాన ఎక్కడ విస్ఫోటనం జరుగుతుందో, ఎవడు ఎక్కడ తుపాకి గుండ్లు కురిపిస్తాడో అని ఏక్షణానికాక్షణం భయంతో బ్రతుకుంది ఈ సమాజం. వీరు సాధించేది ఎమిటి? ఇంతమంది ప్రాణాలు తీయమని చెప్పిందా ఆ మత గ్రంధం? ఎందుకు ఈ హింసావాదం? ప్రపంచం అన్ని రంగాలలో ముందుకు పోతుంది అని అనుకుంటే ఇది ఏమిటి? ఈ ఆధిపత్యపు ధోరణి మనల్ని ఎక్కడకు చేరుస్తుంది. మరలా క్రిందకే చేరుస్తుంది.
కుల వాదం, వర్ణ బేధం, ఇవన్నీ కూడా ఆధిపత్యపు ధోరణికే దారి తీస్తున్నాయి. ఒకరి కులంపై మరొకరు, ఒకరి వర్ణంపై మరొకరు, ఇలా పోరాటాలు సాగిస్తూనే ఉంటారు. హిట్లర్ ద్వేషభావం ఎంతమంది యూదులను పొట్టన పెట్టుకుందో ప్రపంచం మరువలేదు. హిట్లర్ నిరంకుశత్వానికి ప్రపంచాన్ని గెలవాలనే ధోరణి జెర్మనీని ఎలా నాశనం చేసిందో అందరికీ తెలుసు. ఆయనగారి నిరంకుశత్వం తెచ్చిన ప్రపంచ యుద్ధాలు ఈ మానవ చరిత్రలోనే మాయని మచ్చలు. నేలను రక్తసిక్తంచేసి చివరికి ఆత్మహత్యకు పాల్పడి ఆయన సాధించింది? లక్షల మంది మరణానికి కారణమయినాడు. నిలువెత్తు భవనాలు, కట్టడాలు ఆటం బాంబులకు నాశనమయిన హిరోషిమా, నాగసాకీ పట్టణాలే దీనికి తార్కాణాలు. ఆ దాడుల తరువాత 30 సంవత్సరములు అక్కడ ఒక పచ్చని మొక్క మొలవలేదు అంటే, అక్కది పిల్లలు తరతరాలు మారినా, దశాబ్దాలు గడచినా ఎదో ఒక లోపంతో జన్మిస్తున్నారంటే దానికి కారణం? హిట్లర్ క్రూరత్వానికి మరో ఉదాహరణ ఆయన నడిపినconcentration camps (Buchenwald (Weimar)) one more near Munich and Auschwitz (Poland). ఇదొక war crime గా ఇప్పటికీ భావిస్తారు. యుద్ధ ఖైదీలను వేలమందిని చిన్న camps లో బంధించి, హింసించి వేలమందికి చావుకు సాక్షాలుగా ఈ ప్రపంచం ముందు నిలిచాయి ఆ కారాగారాలు.
ప్రపంచం చరిత్రలో నియంతలు ఎందరో!! అది వారి ఆధిపత్య ధోరణిని తెలియజేస్తుంది. హిట్లర్, స్టాలిన్, ముస్సోలిని, సద్దాం హుస్సేన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. సద్దాం హుస్సేన్ అకృత్యాలు ఈ ప్రపంచం మరువదు. కొన్ని లక్షల మందిని బలిగొన్నాడు. వీరంతా తాము నాశనమయ్యి తమతోపాటు ఆయా దేశాలను నాశనం చేశారు. ఇంతా వీరు సాధించినది ఏమిటి? సృష్టించినది మాత్రం రక్తపాతం. మానవజాతి యావత్తూ సిగ్గుతో తలవంచుకునే చర్యలకు పాల్పడి ప్రపంచ చరిత్రలో మాయని మచ్చలుగా మిగిలారు.
ఇవి చాలవా? ఆధిపత్యపు ధోరణికి ఉదాహరణలుగా. గమనించినది ఎమిటి? ఎక్కడ చూసినా రక్తపాతమే. ఇప్పుడు అగ్రరాజ్యమంటూ ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచాలని చూస్తున్న ఈ అమెరికాది ఏ ధోరణి? వీరిని ఏమనాలి? ఏ పేరుతో పిలవాలి?
ఇంత రక్తపాతం సృష్టిస్తున్నా ఈ (ఆధిపత్య) మార్గాన్ని మనిషి ఎందుకు కోరుకుంటాడు? ఇన్ని సత్యాలు గమనించినా, చరిత్ర పాఠం చెబుతున్నా, మనిషి ఎందుకు మారడు? పదే పదే ఆ మార్గానే ఎందుకు నడుస్తాడు? ఆ ధోరణిని ఎందుకు వదలలేడు? హింస, రక్తపాతం అనేవి మనిషికి వినోదాన్ని ఇస్తాయా? ఆ మార్గాలు మనిషి మస్తిష్కానికి హాయినిచ్చి సేద దీరుస్తాయా? అవి ఏమయినా మత్తు పదార్ధములా? వాటికి బానిసగామారి బయటకి రాలేకపోతున్నాడా? తెలిసి తెలిసి పదే పదే ఆ మార్గానే ఎందుకు పయనిస్తున్నాడు? సోదరత్వం, ప్రేమభావం పెంచుకొని సాటివాడిని ప్రేమించే రోజులు ఎప్పుడు వస్తాయి? ప్రపంచ శాంతికి తొడ్పడే రోజులు అసలు వస్తాయా? మనిషి ఆలోచనలలో మార్పు రావాలని, వస్తుందని ఆశిస్తూ.....

19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

నేను

ఈ నేను అందరిలో "నేనే". కొందరికి మెత్తగా, కొందరికి ఖఠినముగా తారసపడే నాలోని "నేను", ఈ కవితా రూపంలో వ్యక్త పరచే ప్రయత్నము చేస్తున్నాను.

నేను నవ్వులు చిందిస్తాను
నిప్పులూ కురిపిస్తాను !
నేను హాయినిచ్చే శీతలపవనాన్ని
మాడ్చివేసే వడగాలి వీచికని !

ఇట్టే కరిగే వెన్నని
చలనం లేని శిలని !
ప్రభాత కిరణాన్ని
చిమ్మచీకటిని !!

చల్లని వెన్నెలని
చంఢప్రచంఢ సూర్యకిరణాన్ని !
పిల్ల కాలువను
మహాసంద్రాన్ని !!

అందివచ్చిన అవకాశాన్ని
పొంచిఉన్న ప్రమాదాన్ని !!
సుతిమెత్తని తివాచీని
నడువజాలని ముళ్ళబాటని !!

మధురమయిన సంగీతాన్ని
భయోత్పాత ప్రళయ ఘోషను !!

నా గుండెలోతుల్లో
ప్రణయం కనిపిస్తుంది
ప్రళయం గోచరిస్తుంది.

అర్ధమయ్యే ఓ సిద్ధాంతాన్ని !
అంతుబట్టని ఓ వేదాంతాన్ని !!