16, ఆగస్టు 2013, శుక్రవారం

మార్పు రాదా

ఒక కర్షకుడు స్వేదాన్ని చిందించి
భూమి తల్లిని  తడిపి పండించిన సిరిని
తనకూ, సమాజానికి అందజేస్తాడు.

ఒక ఉపాద్యాయుడు తన మేధస్సు
తన ఉదరపొషణకై ఉపయోగిస్తూనే 
పరుల జీవితాలలో వెలుగులు నింపుతాడు.

ఒక వైజ్ఞానికుడు తన విజ్ఞానాన్ని
పణంగా పెట్టి సమాజానికి ఎన్నో
అందించి మేలు చేస్తాడు

ఓ కుమ్మరి,
   కమ్మరి,
   కార్మికుడు
వీరందరూ తమను తాము చూసుకుంటూ
దేశానికి, సమజానికి ఏదో రూపంలో
తమ సేవలను అందిస్తూనే ఉంటారు

మరి,
పజల నమ్మకాలతో, సమాజ ప్రోద్బలంతో
గద్దెనెక్కిన నాయకులు
చేసిన వాగ్దానాలు మరచి,
చేయూత నందించిన ప్రజలను విడచి
వారి నమ్మకాలను సొమ్ము చేసుకుంటూ 
దేశాన్ని ఇలా దోచుక తింటున్నారు!

 వారి తీరు ఇంతేనా?
 ఏ క్షణానికి ఏ రంగు మారుస్తారో 
 ఏ పూటకి ఏ గూడు చేరుతారో
 ఏ రోజు ఎవరి పుట్టి ముంచుతారో
 ఎప్పుడు ఎలా స్పందిస్తారో!!

నిన్నటి బద్ద శత్రువు వారికి
నేడు మంచి మిత్రుడు!
నిన్నటి కటిక నిజం వారికి
నేడు అబద్దం!

చెప్పింది చేయడం వారి లక్షణం కాదు
నమ్మించి గొంతుకలు కోయడం వారి నైజం!
అభివృద్దికి  బాటలు వేయటం వారి తీరు కాదు
ఎదిరించిన వారిని అణగతొక్కడం వారికి సహజం!

ఏదో చేద్దామని ఆలోచనే రాదా?
వీరిలో మార్పు అనేది రాదా?
 
 

కవి హ్రుదయం

కవి హ్రుదయం
    ఆనందాన్నీ తాకి చూస్తుంది
    ఆర్థతనూ అనుభవిస్తుంది

కవి హ్రుదయం
    అంబరానా పయనిస్తుంది
    పాతాళానా నిలుస్తుంది

కవి హ్రుదయం
   భవంతుల్లో  సంచరిస్తుంది
   మురికివాడల్లోనూ మసలుతుంది

కవి హ్రుదయం
   సుఖామృతాన్నీ   సేవిస్తుంది
   హాలహలాన్నీ హరిస్తుంది
   కష్టాల కడలినీ ఈదుతుంది
    ముళ్ళ బాటనైనా పయనిస్తుంది 

కవి హ్రుదయం
    ప్రకృతి అందాలను వర్ణిస్తుంది
    మగువల చందాలనీ కీర్తిస్తుంది
    భూ ప్రళయాలనూ వీక్షిస్తుంది
    బడభాగ్నులనూ అనుభవిస్తుంది

కవి హ్రుదయం
   చంద్రుని వెన్నెల సొగసులనూ
   సూర్యుని వెలుగు రేఖలనూ
   కాలం మార్చే రంగులనూ
   అన్నింటినీ చూస్తుంది

కవి హ్రుదయం
   కర్షకుడు చిందించిన స్వేదాన్ని
   కార్మికుడు అనుభవిస్తున్న కస్టాన్ని
   జూదరి వెంట వున్న వ్యసనాన్ని
   దేన్నీ వదలదు

కవి హ్రుదయం
  కాంచని చోటులేదు
  వర్ణించని విషయం లేదు
  అనుభవించని భావం లేదు
  అందుకోని ఎత్తులు లేవు
  చేరుకోని లోతులు లేవు

  శ్రీ శ్రీ అన్నట్లు అగ్గిపిల్ల కుక్కపిల్ల .... ఇవేవీ కవితకు అనర్హం కావు. ఉండాలొయి కవితావేసం, కావలొయి రస  నిర్దేశం.   
 

కాలంతో పరుగు

కాల చక్రం గిర్రున తిరుగుతుంది
మూడు కాలాలు, ఆరు ఋతువులూ
నీ కోసం ఆగవు, నీకేసీ చూడవు
నీవే వాటితో  పరుగు తీయాలి
అలసిపోయి కూర్చున్నా, సోమరివై
కదలకున్నా  కాలం నీకై ఆగదు
అయ్యో పాపమూ అనదు
తన పయనంలో తానుంటుంది
నీ జీవిత పయనం దానికి అనవసరం
నీలాంటి వారెందరో ఈ ప్రపంచంలో
మూడు కాలాల రుచి చవి చూడవలసిందే
ఆరు ఋతువుల క్రమాన్నీ కాంచవలసిందే  
మరి నీలో నైరాశ్యం  ఎందుకు
కాలంతో పరుగు తీయి
ఏ కాలానికి ఆ కాలం విధి నిర్వర్తించు
ఏ ఋతువుకు ఆ రంగు మార్చు
ఈ జీవిత రంగస్థలంలో  రంగు మార్చి
అన్ని వేషాలు కట్టు , అన్ని పాత్రలూ పోషించు
అందరినీ మెప్పించు
అప్పుడే నీకు పరిపూర్ణత!
నీ జీవితానికి సార్థకత!!

విజయం

నేడంటే  నిజమనుకుంటే
రేపంటూ ఉంది అనుకుంటూ
మనసంతా ఉత్సాహంతో
నిండైన ఆత్మ విశ్వాసంతో
ముందుకు నడువు

విజయం వరించినా
పరాజయం పరాభవించినా
నీదైన శైలిలో పయనించు
అలుముకున్న నైరాశ్యాన్ని జయించు
జంకులేక నడక సాగించు

దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి
కొత్త నేస్తాలు కలుస్తాయి
నీ విజయాన్ని చూసి ఈర్ష  పడేవారు
వెన్ను తట్టి  స్పూర్తి నిచ్చేవారు
నిన్ను అభినందించి, ఆనందించేవారు

నీవు ఎవరినీ మరువకు
ఆ ఈర్షా ద్వేషాలు  నీలో
కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి 
గెలిచి తీరాలి అన్న
పట్టుదల పెంచాలి
అభినందనలకు పొంగక
సాధించేది చాలా ఉంది అనుకుంటూ
లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ
అలుపన్నది ఎరుగక గెలుపు సాధించు

చేరుకున్న ఎత్తులు
అందుకున్న అందలాలతో 
పొంగిపోయి, నీవే గొప్పంటూ
బడాయి  కొట్టబోకు
ఆధారం లేనిదే  ఆ ఎత్తుల్లో
నీవు నిలబడలేవు 
ఆధారం భూమి మీద ఉంది
దాన్ని మరువకు
దాన్ని మరిచావో
ఎప్పుడోకప్పుడు ముప్పు తప్పదు
ఒక్కసారిగా ఆ విజయాలు అన్నీ
మాయమై మరుక్షణం
నీవు నేలపై పడతావు
ఇక్కడ నిన్ను ఆదరించే వారుండరు
చేయూత నివ్వకపోగా చెడు  మాట్లడుతారు
సహాయం చెయ్యకపోగా చీదరించుకుంటారు

నీవెక్కిన ఎత్తులు నీతోటి వారికి 
మెట్లుగా మార్చాలి
వారినీ మంచి స్థాయికి  తేవడానికి పాటు పడాలి

అపుడే విజయానికి సార్థకత
ఆ విజయపు ఫలాన్ని తోటి వారికి
పంచినపుడే నీ జీవితంలో గొప్ప విజయం!!!

సత్యాలు

మరువరానిది!
       తల్లి ప్రేమ
       తండ్రి త్యాగం
       గురువు విద్యా భోధన
       మిత్రుని స్నేహం
       ఇతరులు చేసిన సాయం
       చేయల్సిన కార్యం
ఆరాధింపవలసినవి!
       ప్రకృతిని
       కాలన్ని
       మంచిమనసుని
నమ్మవలసినవి!
       ఆత్మస్థైర్యం
        క్రమశిక్షణ
       ధర్మం
       శ్రమ
       శక్తి
      తోటి మానవుడు
కదిలింపరానివి!
     నిదురించే సింహం
     ఆవేశం లో నున్న మనిషి 
     మూలం (ఆధారం) లేని విషయం
భరింపరానివి!
      ఆకలి
      మోసం
      అన్యాయం  
ఊహకందనవి!
     జీవితం
     ఆత్మ
     దైవం
ఊహింపరానివి!
     భయం
     ద్వేషం
     అసూయ
ఆరాధింపరానివి!
     కామ
     క్రోధ
     లోభ
     మోహ
    మద
    మాత్సర్యాలు   


ఎడారి లో ఎండమావి శాంతి

నిదానించి నడు తమ్ముడూ
ఎడారంటి దారిలోన
అదేముంది అనుకోకు తమ్ముడూ
ప్రమాదం పొంచివుంది దాపులోన

నీకంటే ముందు ఈ దారిన
ధీరులు వీరులు అశువులు బాసారు
ఎందరో యోధులు ప్రాణాలు అర్పించారు

జాగర్త సుమా,
పొదలమాటున పొంచియున్న గుంటనక్కలు
చెదలలో బుసలు కొట్టే విషపు నాగులు
పీనుగుకై వెదుకులాడే  రాబందులు
ముందు ముందు పొంచియున్న ఇసుక తుఫాన్లు!

నడచి నడచి దాహం వేస్తే
దప్పిక తీర్చే నీరు లేదు
ఎండ కాసి నీరసిస్తే
సేద తీరే చెట్టు నీడ లేదు
చెమ్మగిల్లి, శక్తి సన్నగిల్లి
సొమ్మసిల్లి పడితే
పలికే దిక్కులేదు!!

వేరొకరి మాటెందుకు
నా విషయమే చెబుతాను!

నా ఆశయం దూరంగా మెరుస్తుంది
అందుకోవాలని పరిగెడుతుంటే
పొంచి వున్న ప్రమాదం
రానే వచ్చింది
పోరాడి గెలుపొందినా,
మార్పు తెచ్చి నా వైపు తిప్పుకున్నా
పయనించే మార్గంలో దూరం
పెరుగుతూనే వుంది!

ఇంతలో ఓ గాలి దుమారం
రేగిన ఇసుకతో దారి కనపడకుంది
దిక్కులు మటు మాయం
అంతా అగమ్య గోచరం!

గాలికి తట్టుకోని నిలబడిన నాకు
నా ఆశయం ముందుకు సాగమంటూ వుంటే

ఆ దూరాన్ని చేరుకున్నా
అక్కడ ఆ మెరిసే ఆ ఆశయం కనపడలేదు
అప్పుడు స్పురించింది నా మనసులో
అది ఎడారి లో ఎండమావని
అది దూరాన్నుంచి నోరు ఊరిస్తింది!

దరికి చేరితే మాయమై  నిరాశపరుస్తుంది!!

ఆ అశయం ఏదో కాదు "శాంతి"
ఈ ప్రపంచములో శాంతి కరువై
నేను వెదుకుతున్న బాట ఎడారి
"ఎడారిలో ఎండమావి శాంతి".