29, మే 2013, బుధవారం

కీచక భారతం


కలంతో రాసినా

గళంతో పలికినా

పెల్లుబుకుతున్న ఆవేశాలకు ఇవి ప్రతిరూపాలే!

జరుగుతున్న దారుణాలకు ఇవి నిలువుటద్దాలే!
 

రోజుకో దారుణం

పూటకో కీచక పర్వం

ఎటు చూసినా, వైపువిన్నా

కళ్ళకు కనబడుతూ

చెవులకు వినబడుతూ!
 

తల్లి లేదు పిల్లని లేదు

పెద్ద లేదు చిన్న లేదు

కంటికి కనబడితే చాలు

మృగాల్లా దూకి

పశువులా అనుభవించి

ప్రాణాలు తీస్తున్నారు

క్షణికావేశాలకు

నూరేళ్ళు బలి చేస్తున్నారు!
 

ఇవన్నీ మనసును చేరి

స్త్రీని గౌరవించే భారతమేనా

ఇదని మనసు కలవరపడి

ఏమి చేయలేని నిస్సాహాయతో క్షోభపడి!

జరుగుతున్న దారుణాలకు

బాధ ఇంతింతై కొండంతై

మండే అగ్ని పర్వతమై!

ఒక్కసారి బ్రద్దలై

కవితగా బయటపడింది

మండుతున్న లావాను

తుఫానూ చల్లార్చలేకపోతుంది!
 

కుక్కాల్లా, పోట్లగిత్తల్లా

ఊరిపైబడి దారుణాలు చేస్తుంటే

ఏమీ చేయని పాలకులు

"ఇది సహజమే" అనే పలుకులు

అగ్నికి ఇంకా ఆజ్యం పోస్తున్నాయి!

చెద సమాజాన్ని తినివేస్తున్నా!

సాంప్రదాయం, సంస్కృతి గల దేశమని

గొప్పలు చెప్పి డప్పులు కొడుతున్నాం!
 

అసలు బండారం బయట ప్రపంచానికి కనిపిస్తూనే ఉంది

రక్షణలేని సమాజంలో జీవిస్తున్నామని తెలుస్తూనే ఉంది.

మరి డాబులెందుకు?


మనల్ని మనం సరి చేసుకోలేమా?

ఈ మానవ మృగాల్ని ఏమీ చేయలేమా?

జాగు చేస్తూ మీనమేషాలు లెక్కెట్టడమెందుకు?

అంతా జరిగాక వెర్రిమొహాలు వేయడమెందుకు?

 
ఇదే సరయిన సమయం!

కదలండి!

 
లా పుస్తకాలు తిరగెయ్యండి!

క్లాజులు, సెక్షన్లూ తగిలించండి!

చట్టాల్లో మార్పు తెండి!

 
తప్పెందుకు చేశామురా అనేలా!

తల ఎత్తేందుకు భయపడేలా!

ఈ బ్రతుకెందుకని బాధపడేలా!

మనిషికి కాదు మనసుకి తగిలేలా!

 

ఇలాంటప్పుడే!

మానవ హక్కుల గూర్చి మాట్లాడొద్దు!

ఏ జాలీ కనికరాలొద్దు!

ఉపేక్షిస్తూ పోతుంటే

ఊరంతా వీరే అవుతారు!పశ్చాత్తాపం అనే పదాలు వాడొద్దు!

అబల ప్రాణం హరించుక పోయాక

మానవత్వం మాటేందుకు?

పశ్చాత్తాపానికి వదులుతార్లే అని

ఇంకోడు ఆ దారే పడతాడు!

చట్టాన్ని చులకన చేస్తాడు!అది కాదు, అలా కాదు!

చట్టాలు చేస్తే!

శిక్షలు అమలు చేస్తే!!

నిద్రలోనయినా ఆలోచనొస్తే

ఆ చట్టం గుర్తొచ్చి చమటలు కక్కాలి!

వెన్నంతా వణుకు పుట్టి జ్వరం రావాలి!ఇక నా వరకయితే

ఈ మాటల తూటాలను వాళ్ళ గుండెల్లో దించాలనుంది!

నా కవితలనే నిప్పుకణికలతో తగలెయ్యాలని ఉంది!

ఈ ఆవేశపు బడ భాగ్నులలో కాల్చేయాలని ఉంది!

ఈ కీచకుల్ని నపుంసకుల్ని చేసి వదలాలనుంది!

27, మే 2013, సోమవారం

కాలంతో పయనం


ప్రపంచం ముందంజ వేస్తుంటే
మనమెందుకు స్థిరంగా ఉండాలి
మన పయనమూ ఆవైపే సాగాలి
అలుపెరుగక పరిశ్రమించి
బాటలో ముందే ఉండాలి!

అలా అని

ప్రపంచం ఎటు వెళ్తుందో
అటే మన పయనమా!
కాస్తంత గమనించి చూస్తే
మనసుకి తెలుస్తుంది!
బాట పయనించ దగ్గదో
వెలివేయ దగ్గదో!!

గొర్రెల మందల్లే కాక
మంచీ చెడులను విశ్లేషించి
విచక్షణతో ముందుకు సాగాలి
ఆనందంతో ఆదర్శ జీవితం సాగించాలి.

23, మే 2013, గురువారం

పరిపక్వ జీవితం


ఉండాలోయ్ ఆవేశం!

 తప్పులను వేలెత్తి చూపేందుకు
అసత్యాన్ని ఖంఢించేందుకు
చెడుపై పోరాడేందుకు
దుర్మార్గాన్ని అంతమొందించేందుకు

కావాలోయ్ ఆలోచన!

మంచేదో చెడేదో గ్రహించేందుకు
ఉత్తమోత్తమ నిర్ణయాలు తీసుకొనేందుకు
ఆచితూచి అడుగులేసేందుకు

ఉండాలోయ్ ఆత్మస్థైర్యం!

ఎన్ని కష్టాలొచ్చినా ఎదురు నిల్చేందుకు
పనయినా విజయవంతంగా ముగించేందుకు
ఓటమిలోనయినా క్రుంగక విజయంకై పోరాడేందుకు

కావాలోయ్ మానవత్వం!

మనిషిని మనిషిగా చూసేందుకు
ఆపదలో ఉన్నవానిని ఆదుకునేందుకు
ఆకలితో ఉన్నవానికి సాయం అందించేందుకు

ఉండాలోయ్ ప్రేమానురాగం!

హాయిగా జీవించేందుకు
శాంతంగా బ్రతికేందుకు
తోడునీడలను పొందేందుకు

కొంచెం శాంతం!
కొంచెం విచక్షణ!
కొంచెం వినమ్రత!

ఇవన్నీ కావాలోయ్!

పరిపూర్ణ వ్యక్తిగా ఎదగేందుకు
పరిపక్వ జీవితం పొందేందుకు
నలుగురి లో నేనై
నేనే నలుగురి నై బ్రతికేందుకు
ఉన్నత జీవన పయనం సాగించేందుకు!

20, మే 2013, సోమవారం

ఈ స్వాతంత్ర్యం మనకొద్దు


అరవది ఆరు వసంతాల
స్వతంత్ర్య భారతి వైభవాన్ని
సింహావలోకనం చేసుకున్న నాకు!

కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకూ
సౌరాష్ట్రం నుండి సిక్కిం వరకూ
దర్శనమిచ్చింది
అరాచకం, పైశాచికం, అవినీతి, పేదరికం!

గుప్పెడు మెతుకులు దొరకక
ఎంగిలి మెతుకులకై
ఆశగా చూస్తూ
డొక్కలు ఎండుక పోయి
ఎముకలు గూడయిన
జీవశ్చవాలు అడుగడుగునా కనిపించాయి!
కన్నీరు కార్చేందుకు
కళ్ళలో చెమ్మలేని బ్రతుకులు దర్శనమిచ్చాయి!!

కామంతో కళ్ళు మూసుకపోయి
పశువుల కంటే హీనంగా
వావివరసలు, చిన్నపెద్ద లేకుండా
అతివలపై, పసికందులపై
అత్యాచారలకు తెగబడుతున్న
ఛండాలురు అడు గడుగునా
మేకుల్లా దారిన తగిలారు!

అతివల ఆవేదనలకు
ఆక్రందనలకు పట్టీపట్టనట్లు
వినీవిననట్లుగా చూస్తున్న
సమాజాన్ని గమనించాను
ఖఠినమయిన చట్టాలు తేలేని
సిగ్గులేని పాలకుల్ని చూశాను!

ధనదాహం, స్వార్దంతో
నిండిన మనసులతో
భూముల్ని కబ్జా చేస్తూ
గనుల్ని ఆక్రమించుకుంటూ
దొరికింది దొరికినట్లుగా
దోచుకుంటున్న పాలకులు!

"దొంగ లంజాకొడుకులు అసలే
మసలుతున్న లోకంలో"
అని ఆవేశంలొ పలికిన శ్రీశ్రీ
గళం, కలం పదును
నేటి దుస్థికి అద్దం పడుతుంది.

వీళ్ళు వదిలిందేదీ లేదు!
పశుగ్రాసాల్ని
రక్షణ ఆయుధాల్ని
శవ పేటికల్ని
ప్రక్రుతి వనరుల్ని
ఇలా ఎన్నని చెప్పాలి!
రోజుకో కుంభకోణం!
అవినీతి నిరోధక శాఖనే
అవినీతి బాట పట్టించిన
సమర్ధులు దేశమంతా నిండి యున్నారు!

ఎంతో మంది మహానీయులు ప్రాణాలర్పించి
జైళ్ళల్లో మగ్గి, బ్రిటీషువారి లాఠీలదెబ్బలకు ఓర్చి
సాధించిన స్వాతంత్ర్యం ఇందుకేనా!

జాతి సంపదను దోచుకొనే ఆమోదమా స్వాతంత్ర్యం!
పైశాచికం తో పైబడి అతివల ఉసురు తీయడంకేనా ...!
దోపిడికీ, అరాచకానికి దౌర్జ్ఞన్యాలకు అడ్డు లేకపోవడమేనా స్వాతంత్ర్యం !!

ఇదంతా చూస్తుంటే స్వాతంత్ర్యం
రాకున్నా బాగుండేదేమో !!

మనస్వేచ్ఛను మనమే హరించుకునే
మన శాంతిని మనమే చంపుకునే
మన జాతిని మనమే నాశనం చేసుకునే
స్వాతంత్ర్యం మనకొద్దు!

స్వాతంత్ర్యం అంటే!
శాంతినిచ్చేది!
అభయాన్నిచ్చేది!
అభివృద్ధినిచ్చేది!
మానవత్వం పెంపొందిచేది!

ఇవేమి ఇవ్వని స్వాతంత్ర్యం మనకొద్దు!