16, ఆగస్టు 2013, శుక్రవారం

మార్పు రాదా

ఒక కర్షకుడు స్వేదాన్ని చిందించి
భూమి తల్లిని  తడిపి పండించిన సిరిని
తనకూ, సమాజానికి అందజేస్తాడు.

ఒక ఉపాద్యాయుడు తన మేధస్సు
తన ఉదరపొషణకై ఉపయోగిస్తూనే 
పరుల జీవితాలలో వెలుగులు నింపుతాడు.

ఒక వైజ్ఞానికుడు తన విజ్ఞానాన్ని
పణంగా పెట్టి సమాజానికి ఎన్నో
అందించి మేలు చేస్తాడు

ఓ కుమ్మరి,
   కమ్మరి,
   కార్మికుడు
వీరందరూ తమను తాము చూసుకుంటూ
దేశానికి, సమజానికి ఏదో రూపంలో
తమ సేవలను అందిస్తూనే ఉంటారు

మరి,
పజల నమ్మకాలతో, సమాజ ప్రోద్బలంతో
గద్దెనెక్కిన నాయకులు
చేసిన వాగ్దానాలు మరచి,
చేయూత నందించిన ప్రజలను విడచి
వారి నమ్మకాలను సొమ్ము చేసుకుంటూ 
దేశాన్ని ఇలా దోచుక తింటున్నారు!

 వారి తీరు ఇంతేనా?
 ఏ క్షణానికి ఏ రంగు మారుస్తారో 
 ఏ పూటకి ఏ గూడు చేరుతారో
 ఏ రోజు ఎవరి పుట్టి ముంచుతారో
 ఎప్పుడు ఎలా స్పందిస్తారో!!

నిన్నటి బద్ద శత్రువు వారికి
నేడు మంచి మిత్రుడు!
నిన్నటి కటిక నిజం వారికి
నేడు అబద్దం!

చెప్పింది చేయడం వారి లక్షణం కాదు
నమ్మించి గొంతుకలు కోయడం వారి నైజం!
అభివృద్దికి  బాటలు వేయటం వారి తీరు కాదు
ఎదిరించిన వారిని అణగతొక్కడం వారికి సహజం!

ఏదో చేద్దామని ఆలోచనే రాదా?
వీరిలో మార్పు అనేది రాదా?
 
 

కవి హ్రుదయం

కవి హ్రుదయం
    ఆనందాన్నీ తాకి చూస్తుంది
    ఆర్థతనూ అనుభవిస్తుంది

కవి హ్రుదయం
    అంబరానా పయనిస్తుంది
    పాతాళానా నిలుస్తుంది

కవి హ్రుదయం
   భవంతుల్లో  సంచరిస్తుంది
   మురికివాడల్లోనూ మసలుతుంది

కవి హ్రుదయం
   సుఖామృతాన్నీ   సేవిస్తుంది
   హాలహలాన్నీ హరిస్తుంది
   కష్టాల కడలినీ ఈదుతుంది
    ముళ్ళ బాటనైనా పయనిస్తుంది 

కవి హ్రుదయం
    ప్రకృతి అందాలను వర్ణిస్తుంది
    మగువల చందాలనీ కీర్తిస్తుంది
    భూ ప్రళయాలనూ వీక్షిస్తుంది
    బడభాగ్నులనూ అనుభవిస్తుంది

కవి హ్రుదయం
   చంద్రుని వెన్నెల సొగసులనూ
   సూర్యుని వెలుగు రేఖలనూ
   కాలం మార్చే రంగులనూ
   అన్నింటినీ చూస్తుంది

కవి హ్రుదయం
   కర్షకుడు చిందించిన స్వేదాన్ని
   కార్మికుడు అనుభవిస్తున్న కస్టాన్ని
   జూదరి వెంట వున్న వ్యసనాన్ని
   దేన్నీ వదలదు

కవి హ్రుదయం
  కాంచని చోటులేదు
  వర్ణించని విషయం లేదు
  అనుభవించని భావం లేదు
  అందుకోని ఎత్తులు లేవు
  చేరుకోని లోతులు లేవు

  శ్రీ శ్రీ అన్నట్లు అగ్గిపిల్ల కుక్కపిల్ల .... ఇవేవీ కవితకు అనర్హం కావు. ఉండాలొయి కవితావేసం, కావలొయి రస  నిర్దేశం.   
 

కాలంతో పరుగు

కాల చక్రం గిర్రున తిరుగుతుంది
మూడు కాలాలు, ఆరు ఋతువులూ
నీ కోసం ఆగవు, నీకేసీ చూడవు
నీవే వాటితో  పరుగు తీయాలి
అలసిపోయి కూర్చున్నా, సోమరివై
కదలకున్నా  కాలం నీకై ఆగదు
అయ్యో పాపమూ అనదు
తన పయనంలో తానుంటుంది
నీ జీవిత పయనం దానికి అనవసరం
నీలాంటి వారెందరో ఈ ప్రపంచంలో
మూడు కాలాల రుచి చవి చూడవలసిందే
ఆరు ఋతువుల క్రమాన్నీ కాంచవలసిందే  
మరి నీలో నైరాశ్యం  ఎందుకు
కాలంతో పరుగు తీయి
ఏ కాలానికి ఆ కాలం విధి నిర్వర్తించు
ఏ ఋతువుకు ఆ రంగు మార్చు
ఈ జీవిత రంగస్థలంలో  రంగు మార్చి
అన్ని వేషాలు కట్టు , అన్ని పాత్రలూ పోషించు
అందరినీ మెప్పించు
అప్పుడే నీకు పరిపూర్ణత!
నీ జీవితానికి సార్థకత!!

విజయం

నేడంటే  నిజమనుకుంటే
రేపంటూ ఉంది అనుకుంటూ
మనసంతా ఉత్సాహంతో
నిండైన ఆత్మ విశ్వాసంతో
ముందుకు నడువు

విజయం వరించినా
పరాజయం పరాభవించినా
నీదైన శైలిలో పయనించు
అలుముకున్న నైరాశ్యాన్ని జయించు
జంకులేక నడక సాగించు

దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి
కొత్త నేస్తాలు కలుస్తాయి
నీ విజయాన్ని చూసి ఈర్ష  పడేవారు
వెన్ను తట్టి  స్పూర్తి నిచ్చేవారు
నిన్ను అభినందించి, ఆనందించేవారు

నీవు ఎవరినీ మరువకు
ఆ ఈర్షా ద్వేషాలు  నీలో
కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి 
గెలిచి తీరాలి అన్న
పట్టుదల పెంచాలి
అభినందనలకు పొంగక
సాధించేది చాలా ఉంది అనుకుంటూ
లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ
అలుపన్నది ఎరుగక గెలుపు సాధించు

చేరుకున్న ఎత్తులు
అందుకున్న అందలాలతో 
పొంగిపోయి, నీవే గొప్పంటూ
బడాయి  కొట్టబోకు
ఆధారం లేనిదే  ఆ ఎత్తుల్లో
నీవు నిలబడలేవు 
ఆధారం భూమి మీద ఉంది
దాన్ని మరువకు
దాన్ని మరిచావో
ఎప్పుడోకప్పుడు ముప్పు తప్పదు
ఒక్కసారిగా ఆ విజయాలు అన్నీ
మాయమై మరుక్షణం
నీవు నేలపై పడతావు
ఇక్కడ నిన్ను ఆదరించే వారుండరు
చేయూత నివ్వకపోగా చెడు  మాట్లడుతారు
సహాయం చెయ్యకపోగా చీదరించుకుంటారు

నీవెక్కిన ఎత్తులు నీతోటి వారికి 
మెట్లుగా మార్చాలి
వారినీ మంచి స్థాయికి  తేవడానికి పాటు పడాలి

అపుడే విజయానికి సార్థకత
ఆ విజయపు ఫలాన్ని తోటి వారికి
పంచినపుడే నీ జీవితంలో గొప్ప విజయం!!!

సత్యాలు

మరువరానిది!
       తల్లి ప్రేమ
       తండ్రి త్యాగం
       గురువు విద్యా భోధన
       మిత్రుని స్నేహం
       ఇతరులు చేసిన సాయం
       చేయల్సిన కార్యం
ఆరాధింపవలసినవి!
       ప్రకృతిని
       కాలన్ని
       మంచిమనసుని
నమ్మవలసినవి!
       ఆత్మస్థైర్యం
        క్రమశిక్షణ
       ధర్మం
       శ్రమ
       శక్తి
      తోటి మానవుడు
కదిలింపరానివి!
     నిదురించే సింహం
     ఆవేశం లో నున్న మనిషి 
     మూలం (ఆధారం) లేని విషయం
భరింపరానివి!
      ఆకలి
      మోసం
      అన్యాయం  
ఊహకందనవి!
     జీవితం
     ఆత్మ
     దైవం
ఊహింపరానివి!
     భయం
     ద్వేషం
     అసూయ
ఆరాధింపరానివి!
     కామ
     క్రోధ
     లోభ
     మోహ
    మద
    మాత్సర్యాలు   


ఎడారి లో ఎండమావి శాంతి

నిదానించి నడు తమ్ముడూ
ఎడారంటి దారిలోన
అదేముంది అనుకోకు తమ్ముడూ
ప్రమాదం పొంచివుంది దాపులోన

నీకంటే ముందు ఈ దారిన
ధీరులు వీరులు అశువులు బాసారు
ఎందరో యోధులు ప్రాణాలు అర్పించారు

జాగర్త సుమా,
పొదలమాటున పొంచియున్న గుంటనక్కలు
చెదలలో బుసలు కొట్టే విషపు నాగులు
పీనుగుకై వెదుకులాడే  రాబందులు
ముందు ముందు పొంచియున్న ఇసుక తుఫాన్లు!

నడచి నడచి దాహం వేస్తే
దప్పిక తీర్చే నీరు లేదు
ఎండ కాసి నీరసిస్తే
సేద తీరే చెట్టు నీడ లేదు
చెమ్మగిల్లి, శక్తి సన్నగిల్లి
సొమ్మసిల్లి పడితే
పలికే దిక్కులేదు!!

వేరొకరి మాటెందుకు
నా విషయమే చెబుతాను!

నా ఆశయం దూరంగా మెరుస్తుంది
అందుకోవాలని పరిగెడుతుంటే
పొంచి వున్న ప్రమాదం
రానే వచ్చింది
పోరాడి గెలుపొందినా,
మార్పు తెచ్చి నా వైపు తిప్పుకున్నా
పయనించే మార్గంలో దూరం
పెరుగుతూనే వుంది!

ఇంతలో ఓ గాలి దుమారం
రేగిన ఇసుకతో దారి కనపడకుంది
దిక్కులు మటు మాయం
అంతా అగమ్య గోచరం!

గాలికి తట్టుకోని నిలబడిన నాకు
నా ఆశయం ముందుకు సాగమంటూ వుంటే

ఆ దూరాన్ని చేరుకున్నా
అక్కడ ఆ మెరిసే ఆ ఆశయం కనపడలేదు
అప్పుడు స్పురించింది నా మనసులో
అది ఎడారి లో ఎండమావని
అది దూరాన్నుంచి నోరు ఊరిస్తింది!

దరికి చేరితే మాయమై  నిరాశపరుస్తుంది!!

ఆ అశయం ఏదో కాదు "శాంతి"
ఈ ప్రపంచములో శాంతి కరువై
నేను వెదుకుతున్న బాట ఎడారి
"ఎడారిలో ఎండమావి శాంతి".

10, జూన్ 2013, సోమవారం

అరాచకాంధ్ర


 
నిన్న శ్రీశ్రీ "ఖడ్గసృష్టి" లోని కొన్ని కవితల్ని చదువుతుంటే కొన్ని ఆలోచనలు మనసులో
స్ఫురించాయి. 40/50 సంవత్సరములక్రితం రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో ఆయన కవితల్లో
స్ఫష్టంగా కనబడింది. రాష్ట్రం ఏర్పడిన చాలా సంవత్సరాల వరకూ ఎక్కువ అభివృద్ధి లేని
పరిస్థితులు ఆ కవితల్లో కనపడ్డాయి. సరే అప్పటికి మనకు రాష్ట్రం వచ్చి కొన్నేళ్ళుగా
అనుకుంటే ఇప్పటి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మళ్ళీ మనం వెనక్కి వెళుతున్నామా
అని ఉంది. ఈ పరిస్థితుల్ని ఆలోచిస్తుంటే ఓ కవిత నా మనసులో స్ఫురించింది.


మనకంటూ ఒక రాష్ట్రం కావాలని,
మనమంతా ఒకరిగా ఉండాలని,
భాషకి పట్టం కట్టాలని,
పోరాడి గెలిచాం!
రాష్ట్రాన్ని సాధించాం!!

అభివృద్ధి కలలు కన్నాం!
ప్రణాళికలు వేశాం!
బడ్జెట్లు ప్రవేశ పెట్టాం!!

కానీ ఏమి జరిగింది?

అరాచకం పెరిగింది!
అధోగతి పాలయింది!
దారి తప్పి పయనిస్తుంది!!

నాయకులు ఎందరో ఒచ్చారు
పాలకులు మారారు
మాటలెన్నో చెప్పారు!
చేతల్లో చూపలేకపోయారు!!

ఏదేదో చేస్తామన్నారు
ప్రాజెక్టులన్నారు
పేదరికం కనిపించదన్నారు
కులవాదం లేదన్నారు
మత మంటే అసలేందన్నారు
ప్రాంతాలు లేవన్నారు!
జాతి నెపం కూడదన్నారు
అవినేతికి దూరమన్నారు.
మరి ఏమయ్యింది!

ప్రాంతాలకోసం మారణ హోమం జరుగుతుంది
జన జీవనం స్తంభించింది
భయం రాజ్యమేలుతుంది
కులపిచ్చి కారుచిచ్చి అయ్యింది
మతం మహమ్మారిలా మారింది
పేదరికం పాతాళానికి చేరింది!
అవినీతి ఆకాశానికి ఎగసింది!!

అభివృద్ధిమాట దేవుడెరుగు!

కనీస సౌకర్యాలు కరువయ్యాయి
విద్యుత్తుకు కొరత, నీటికి కొరత
అధిక ధరలు,
భధ్రత లేదు, శాంతి లేదు!
చివరికి పరిపాలన లేదు!!

ప్రకృతి వనరులు దోచేడొకడు
భూమిని మింగి సొమ్ము చేసుకునేదొకడు
ప్రజల కడుపు కొట్టే వాడొకడు
శవరాజకీయం చేసేదొకడు
కోట్లు దోచి తాపీగా ఉండేదొకడు.

రాష్ట్రం ఏమయితేవాడికేం
ప్రజలు ఎటుబోతే వీళ్ళకేం
వీడి జేబులు నిండాయి!

కుర్చీకోసం ఏమయినా చేస్తారు
ప్రాంతాలను విభజిస్తారు
కులాల చిచ్చు రేపుతారు
మతాల మంట రగులుస్తారు
ధనప్రలోభాలు చేస్తారు

కానీ ప్రజలకేమయ్యింది?

ఇవన్నీ చూస్తున్నారు
ఊరకే మిన్నకున్నారు
ఆలోచన నశించిందా?
లేక ధైర్యం చాలడం లేదా?

నీ చేతిలోనే ఉంది కదా!

ఆయుధం! ఓటు!
ఏం దీన్ని సరిగ్గా వాడడం లేదేం?
కులవాదం నషాళానికంటిందా!
మతవాదం మనసంతా నిడిందా!
దోచిన సొమ్ము మనది కాదుగా అన్న భావనా!
మనదాకా రాలేదని అలసత్వమా!!

మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే అవకాశం
వదుల్కొని ప్రలోభాలకు లొంగి,
వివేకం మరచి ఎవరెక్కువ
దొచుకుంటున్నారో వారికి పట్టం కడుతున్నాం.

మారాలి!
మనమే మారాలి!

వీరిని రాష్ట్రం నుంచి పారదోలాలి.
ఆలోచించండి!
ఆవేశాలు వద్దు.
మన భవిష్యత్తు మనకు ముద్దు.

నిర్మిద్దాం హరితాంధ్రను, అభివృద్ధి పధంలో నడుపుదాం.
ఆటవిక సమాజం నుండి ఆధునిక సమాజానికి రాష్ట్రాన్ని నడిపిద్దాం.
ప్రపంచం ముందుకెడుతుంటే అభివృద్ధి నశించిన రాష్ట్రాన్ని మారుద్దాం.
ఈ దోపిడీదొంగల్ని, ఈ రాజకీయ రాబందుల్నుండి రాష్ట్రాన్ని రక్షిద్దాం!

ఆలోచించండి!!


29, మే 2013, బుధవారం

కీచక భారతం


కలంతో రాసినా

గళంతో పలికినా

పెల్లుబుకుతున్న ఆవేశాలకు ఇవి ప్రతిరూపాలే!

జరుగుతున్న దారుణాలకు ఇవి నిలువుటద్దాలే!
 

రోజుకో దారుణం

పూటకో కీచక పర్వం

ఎటు చూసినా, వైపువిన్నా

కళ్ళకు కనబడుతూ

చెవులకు వినబడుతూ!
 

తల్లి లేదు పిల్లని లేదు

పెద్ద లేదు చిన్న లేదు

కంటికి కనబడితే చాలు

మృగాల్లా దూకి

పశువులా అనుభవించి

ప్రాణాలు తీస్తున్నారు

క్షణికావేశాలకు

నూరేళ్ళు బలి చేస్తున్నారు!
 

ఇవన్నీ మనసును చేరి

స్త్రీని గౌరవించే భారతమేనా

ఇదని మనసు కలవరపడి

ఏమి చేయలేని నిస్సాహాయతో క్షోభపడి!

జరుగుతున్న దారుణాలకు

బాధ ఇంతింతై కొండంతై

మండే అగ్ని పర్వతమై!

ఒక్కసారి బ్రద్దలై

కవితగా బయటపడింది

మండుతున్న లావాను

తుఫానూ చల్లార్చలేకపోతుంది!
 

కుక్కాల్లా, పోట్లగిత్తల్లా

ఊరిపైబడి దారుణాలు చేస్తుంటే

ఏమీ చేయని పాలకులు

"ఇది సహజమే" అనే పలుకులు

అగ్నికి ఇంకా ఆజ్యం పోస్తున్నాయి!

చెద సమాజాన్ని తినివేస్తున్నా!

సాంప్రదాయం, సంస్కృతి గల దేశమని

గొప్పలు చెప్పి డప్పులు కొడుతున్నాం!
 

అసలు బండారం బయట ప్రపంచానికి కనిపిస్తూనే ఉంది

రక్షణలేని సమాజంలో జీవిస్తున్నామని తెలుస్తూనే ఉంది.

మరి డాబులెందుకు?


మనల్ని మనం సరి చేసుకోలేమా?

ఈ మానవ మృగాల్ని ఏమీ చేయలేమా?

జాగు చేస్తూ మీనమేషాలు లెక్కెట్టడమెందుకు?

అంతా జరిగాక వెర్రిమొహాలు వేయడమెందుకు?

 
ఇదే సరయిన సమయం!

కదలండి!

 
లా పుస్తకాలు తిరగెయ్యండి!

క్లాజులు, సెక్షన్లూ తగిలించండి!

చట్టాల్లో మార్పు తెండి!

 
తప్పెందుకు చేశామురా అనేలా!

తల ఎత్తేందుకు భయపడేలా!

ఈ బ్రతుకెందుకని బాధపడేలా!

మనిషికి కాదు మనసుకి తగిలేలా!

 

ఇలాంటప్పుడే!

మానవ హక్కుల గూర్చి మాట్లాడొద్దు!

ఏ జాలీ కనికరాలొద్దు!

ఉపేక్షిస్తూ పోతుంటే

ఊరంతా వీరే అవుతారు!పశ్చాత్తాపం అనే పదాలు వాడొద్దు!

అబల ప్రాణం హరించుక పోయాక

మానవత్వం మాటేందుకు?

పశ్చాత్తాపానికి వదులుతార్లే అని

ఇంకోడు ఆ దారే పడతాడు!

చట్టాన్ని చులకన చేస్తాడు!అది కాదు, అలా కాదు!

చట్టాలు చేస్తే!

శిక్షలు అమలు చేస్తే!!

నిద్రలోనయినా ఆలోచనొస్తే

ఆ చట్టం గుర్తొచ్చి చమటలు కక్కాలి!

వెన్నంతా వణుకు పుట్టి జ్వరం రావాలి!ఇక నా వరకయితే

ఈ మాటల తూటాలను వాళ్ళ గుండెల్లో దించాలనుంది!

నా కవితలనే నిప్పుకణికలతో తగలెయ్యాలని ఉంది!

ఈ ఆవేశపు బడ భాగ్నులలో కాల్చేయాలని ఉంది!

ఈ కీచకుల్ని నపుంసకుల్ని చేసి వదలాలనుంది!

27, మే 2013, సోమవారం

కాలంతో పయనం


ప్రపంచం ముందంజ వేస్తుంటే
మనమెందుకు స్థిరంగా ఉండాలి
మన పయనమూ ఆవైపే సాగాలి
అలుపెరుగక పరిశ్రమించి
బాటలో ముందే ఉండాలి!

అలా అని

ప్రపంచం ఎటు వెళ్తుందో
అటే మన పయనమా!
కాస్తంత గమనించి చూస్తే
మనసుకి తెలుస్తుంది!
బాట పయనించ దగ్గదో
వెలివేయ దగ్గదో!!

గొర్రెల మందల్లే కాక
మంచీ చెడులను విశ్లేషించి
విచక్షణతో ముందుకు సాగాలి
ఆనందంతో ఆదర్శ జీవితం సాగించాలి.

23, మే 2013, గురువారం

పరిపక్వ జీవితం


ఉండాలోయ్ ఆవేశం!

 తప్పులను వేలెత్తి చూపేందుకు
అసత్యాన్ని ఖంఢించేందుకు
చెడుపై పోరాడేందుకు
దుర్మార్గాన్ని అంతమొందించేందుకు

కావాలోయ్ ఆలోచన!

మంచేదో చెడేదో గ్రహించేందుకు
ఉత్తమోత్తమ నిర్ణయాలు తీసుకొనేందుకు
ఆచితూచి అడుగులేసేందుకు

ఉండాలోయ్ ఆత్మస్థైర్యం!

ఎన్ని కష్టాలొచ్చినా ఎదురు నిల్చేందుకు
పనయినా విజయవంతంగా ముగించేందుకు
ఓటమిలోనయినా క్రుంగక విజయంకై పోరాడేందుకు

కావాలోయ్ మానవత్వం!

మనిషిని మనిషిగా చూసేందుకు
ఆపదలో ఉన్నవానిని ఆదుకునేందుకు
ఆకలితో ఉన్నవానికి సాయం అందించేందుకు

ఉండాలోయ్ ప్రేమానురాగం!

హాయిగా జీవించేందుకు
శాంతంగా బ్రతికేందుకు
తోడునీడలను పొందేందుకు

కొంచెం శాంతం!
కొంచెం విచక్షణ!
కొంచెం వినమ్రత!

ఇవన్నీ కావాలోయ్!

పరిపూర్ణ వ్యక్తిగా ఎదగేందుకు
పరిపక్వ జీవితం పొందేందుకు
నలుగురి లో నేనై
నేనే నలుగురి నై బ్రతికేందుకు
ఉన్నత జీవన పయనం సాగించేందుకు!

20, మే 2013, సోమవారం

ఈ స్వాతంత్ర్యం మనకొద్దు


అరవది ఆరు వసంతాల
స్వతంత్ర్య భారతి వైభవాన్ని
సింహావలోకనం చేసుకున్న నాకు!

కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకూ
సౌరాష్ట్రం నుండి సిక్కిం వరకూ
దర్శనమిచ్చింది
అరాచకం, పైశాచికం, అవినీతి, పేదరికం!

గుప్పెడు మెతుకులు దొరకక
ఎంగిలి మెతుకులకై
ఆశగా చూస్తూ
డొక్కలు ఎండుక పోయి
ఎముకలు గూడయిన
జీవశ్చవాలు అడుగడుగునా కనిపించాయి!
కన్నీరు కార్చేందుకు
కళ్ళలో చెమ్మలేని బ్రతుకులు దర్శనమిచ్చాయి!!

కామంతో కళ్ళు మూసుకపోయి
పశువుల కంటే హీనంగా
వావివరసలు, చిన్నపెద్ద లేకుండా
అతివలపై, పసికందులపై
అత్యాచారలకు తెగబడుతున్న
ఛండాలురు అడు గడుగునా
మేకుల్లా దారిన తగిలారు!

అతివల ఆవేదనలకు
ఆక్రందనలకు పట్టీపట్టనట్లు
వినీవిననట్లుగా చూస్తున్న
సమాజాన్ని గమనించాను
ఖఠినమయిన చట్టాలు తేలేని
సిగ్గులేని పాలకుల్ని చూశాను!

ధనదాహం, స్వార్దంతో
నిండిన మనసులతో
భూముల్ని కబ్జా చేస్తూ
గనుల్ని ఆక్రమించుకుంటూ
దొరికింది దొరికినట్లుగా
దోచుకుంటున్న పాలకులు!

"దొంగ లంజాకొడుకులు అసలే
మసలుతున్న లోకంలో"
అని ఆవేశంలొ పలికిన శ్రీశ్రీ
గళం, కలం పదును
నేటి దుస్థికి అద్దం పడుతుంది.

వీళ్ళు వదిలిందేదీ లేదు!
పశుగ్రాసాల్ని
రక్షణ ఆయుధాల్ని
శవ పేటికల్ని
ప్రక్రుతి వనరుల్ని
ఇలా ఎన్నని చెప్పాలి!
రోజుకో కుంభకోణం!
అవినీతి నిరోధక శాఖనే
అవినీతి బాట పట్టించిన
సమర్ధులు దేశమంతా నిండి యున్నారు!

ఎంతో మంది మహానీయులు ప్రాణాలర్పించి
జైళ్ళల్లో మగ్గి, బ్రిటీషువారి లాఠీలదెబ్బలకు ఓర్చి
సాధించిన స్వాతంత్ర్యం ఇందుకేనా!

జాతి సంపదను దోచుకొనే ఆమోదమా స్వాతంత్ర్యం!
పైశాచికం తో పైబడి అతివల ఉసురు తీయడంకేనా ...!
దోపిడికీ, అరాచకానికి దౌర్జ్ఞన్యాలకు అడ్డు లేకపోవడమేనా స్వాతంత్ర్యం !!

ఇదంతా చూస్తుంటే స్వాతంత్ర్యం
రాకున్నా బాగుండేదేమో !!

మనస్వేచ్ఛను మనమే హరించుకునే
మన శాంతిని మనమే చంపుకునే
మన జాతిని మనమే నాశనం చేసుకునే
స్వాతంత్ర్యం మనకొద్దు!

స్వాతంత్ర్యం అంటే!
శాంతినిచ్చేది!
అభయాన్నిచ్చేది!
అభివృద్ధినిచ్చేది!
మానవత్వం పెంపొందిచేది!

ఇవేమి ఇవ్వని స్వాతంత్ర్యం మనకొద్దు!