31, మార్చి 2010, బుధవారం

మార్పు మనలో రావాలి

ఈ వ్యవస్త లో మార్పు రావాలి, అవినీతిని అంత మొందించాలి అంటూ, ఈ అవినీతికి అంతా రాజకీయ నాయకులను మరియు ప్రభుత్వ ఉద్యోగులనే భాద్యులను చేస్తూ నిందించడం మనం నిత్యం చేసే పని. అరె, వ్యవస్త అంటే ఏమిటి?. మనమే కదా. మనలో మార్పు వస్తే వ్యవస్త అదే బాగు పడుటుంది. ఆ రాజకీయ నాయకుడెవరు?. మనం ఎన్నుకున్నవాడే కదా. ఇంత తెలిసి కూడా అవినీతి పరుడ్ని ఎందుకు ఎన్నుకున్నావు?. నీవేదో దేశాన్ని ఉద్దరిస్తున్న వాడిలా, అవినీతంతా రాజకీయ నాయకులో లేదా ప్రభుత్వ ఉద్యోగులో చెస్తున్నట్లు మాట్లాడడం సబబు కాదు. అవినీతి మన అందరిలో ఉంది. మనకు ప్రతినిధులుగా కొందరిని ఎన్నుకుంటున్నావు. వాడు నీలోని అవినీతికి ప్రతిబింబమే. ఐతే వాడి నుండి నీవు నీతిని ఎలా కోరుకుంటావు. అలా కోరుకోవడమూ అవినీతతే.

మనలోనే మార్పు రావాలన్న విషయానికి చిన్నగా వద్దాం. మొదట రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు (ఓటు) గురించి మాట్లాడుకుందాం. అసలు మనము ఓటు ఎందుకు వేస్తున్నాము. అది మాత్రం ఆలోచించం. మన ఓటు కున్న ప్రాముఖ్యత ఏంత అన్నది మనకు తెలియదు. ఎవరికి అధికారం అందిస్తున్నాము. వాడు అసలు అర్హుడేనా అన్న విషయం ఆలోచించం. రాబోయే ఐదేళ్ళ లో మన దిశను, గమనాన్ని, అభివృద్దిని నిర్దేశించగల ఆయుధం ఓటు అని, అది తమకు తాముగా ఆలోచించుకొని విచక్షణ తో మంచి వ్యక్తిని ఎంపిక చేసుకొని, ఆ వ్యక్తికే తమ పవిత్రమైన ఆ ఓటు ను వెయ్యాలని ఎంత మందిలో అవగాహన ఉంది. ఒక్కసారి పొరబాటు చేస్తే దానికి ఐదు వర్షాలు మనం శిక్ష అనుభవించాలని, వారి వల్ల దేశం మరో పది సంవత్సరాలు వెనక్కి వెలుతుందని ఆలోచనే చెయ్యరు. అది వారి ఊహ లోకే రాదు. కొనే 50 రూపాయల వస్తువు గురించి వందసార్లు ఆలోచించే మనం కొన్ని వేల కోట్లను ప్రజలకు వినియోగించడానికి ఓ ప్రతినిధిని ఎన్నుకొనే విషయంలో ఓ క్షణం ఎందుకు ఆలోచించము. దేశం నాశనం ఐనా పర్వాలేదా. స్వాతంత్ర దినోత్సవం నాడో, గణతంత్ర దినోత్సవం నాడో తప్పితే దేశం ఇంకోసారి గుర్తుకు రాదా.

ఆ అభ్యర్థి పంచే 500 రూపాయల నోటుకో, లేక వాడిచ్చే సారా పొట్లాం కో సలాం కొట్టి గులాం అవుతున్నడే కానీ, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకోడు. అరే వీరికి విచక్షణ లేదా. ఇంత గెలవడానికి ఖర్ఛు పెట్టిన వాడు, తరువాత మన సొమ్మే అంతకు అంత దోచుక తింటాడన్న జ్ఞానం లేదా?. రాజకీయం ఓ వ్యాపారం ఐనది. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టడం. ఇదేళ్ళ లో పదింతల లాభం ఆర్జించడం. నష్ట పోతున్నదెవరు. వాడిని గెలిపించిన వాడేగా?.

డబ్బు తీసుకొని ఓటు వేసే సంస్క్సతి నీఛం. మన తల రాతను మనమే రాయగల అవకాశాన్ని వదులుకొని అవినీతికి పాల్పడి, ఓ అల్పుడను గద్దెనెక్కించి దేశ భవిష్యత్తును నిర్దేశించే అత్యున్నతమైన ఆ ఆలయానికి పంపడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఓటును డబ్బులిచ్చి కొన్న వాడు ప్రజాప్రతినిధి ఎలా అవుతాడు. మన మనసుల్ని గెలువక మనుషుల్ని కొన్నవాడు నాయకుడెలా అవుతాడు. వాడు వ్యాపారి. ఇవ్వాల కొన్నవాడు, రేపు మన ఆత్మాభిమానాలను అంగట్లో బేరానికి పెడతాడు. అంతా అయిన తరువాత నీకు ప్రశ్నించే హక్కు ఉండదు. ఎందుకంటే దానిలో నీవు కూడా భాగస్వామివే. నీలో రీతిని, నీలో అవినీతిని నీ ప్రతినిధిగా నీవు ఎన్నుకున్నావు. ఇక ప్రశ్నించే ఆలోచన నీ కెప్పటికి వస్తుంది. నిన్ను నీవు ప్రశ్నించు కోగలిగే స్థాయి ఉంటే నీవు ఇలా ఎలా ఆలోచిస్తావు.

ప్రజల మనసుల్లోని ఆలోచనల ప్రతిబింబమేనండీ ఆ ప్రజాప్రతినిధుల సభ. నీ ఆలోచన సరిగ్గా వుంటే అది అంత పవిత్రంగా ఉంటుంది. మన ఆలోచనలు ఇలా ఉంటే వాటి ప్రతిబింబం గొప్పగా, ఆదర్శ వంతంగా ఎందుకు ఉంటుంది

ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి, ఈ దేశాన్ని, వ్యవస్థని మార్చాలి అని మాటలు చెబుతూ కాలం వెల్లబుచ్చుతాం. ఎవరో ఎందుకు వస్తారు. మన లోనే మార్పు రావాలి. మనం నిజాయితీ గా ఉందాం. ఏ అవినీతికి పాల్పడకుండా వుందాం. ఆరాచకాన్ని సృష్టించద్దు. సభ్య సమాజం గర్వపడే వ్యక్తిగా ఎదుగుదాం. మనల్ని మనం సరి చేసుకుందాం. అందరం అలా ఉంటే అదే మార్పు. మార్పు ఎవరో బలవంతానో, చమత్కారంగానో తేజాలరు. మనకు మనంగా అనుసరించి అనుభవించాలి.

ఎవరికి వారు మునిసిపాలిటి వారొస్తారుగా అని ఇళ్ళ ముందే చెత్త వేస్తే ఆ వీధంతా దుర్గంధం అవుతుంది. అదే ఎవరికి వారు భాధ్యతతో ఆ వీధి చివర ఉన్న చెత్త కుండీలో వేస్తే వీధి శుభ్రంగా ఉంటుంది. ఎవరికి వారు తమంతట తాము ఆలోచించి అలవరుచుకోవాలి. ఇలా ఏ అంశం అయినా, ఏ విషయయినా ఆలోచిస్తే మార్పు తప్పని సరిగా వస్తుంది. మనందరం గర్వపడే సమాజాన్ని, దేశాన్ని మనమే నిర్మించుకోవచ్చు. అభివృద్ది చెందాలన్నా, అణగారి పొవడమయినా అంతా మన చేతుల్లోనే ఉంది.

కాబట్టి మార్పు మన ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో రావాలి. ఆలోచనల్నిఅభ్యుదయం లోకి నడిపించి అభివృద్దికి మనం పునాది వెయ్యాలి. ఎవడూ గొప్పవాడు కాదు. ఎవడూ దుర్మార్గుడు కాదు. మనసును సన్మార్గంలో నడిపిస్తే మార్పు సహజంగా వస్తుంది. ఆ మార్పునే మనం కోరుకుందాం. ఎవరో మార్ఛాలని ఆశించద్దు. మనకు మనం అలోచిద్దాం, ఆచరిద్దాం. నోటు రాజకీయాలను మనసుల నుండి చెరిపేసి అభ్యుదయాన్ని పాటిస్తూ, అభివృద్దిని కోరుకుందాం. ఆదర్శవంతుడ్ని మన ప్రతినిధిగా ఎన్నుకుందాం.