6, జూన్ 2010, ఆదివారం

సముద్రం

దూరం నుంచి చూస్తే కనుచూపుమేరలో
భూమంతా తానే ఆవహించి
ఆకాశాన్ని తాకుతు కనిపించింది.!
దగ్గరకు వెళ్ళి నిలబడే లోపే
స్వాగతం అంటూ పాదాలను తాకి పలకరించింది
ఆ స్పర్శ అనుభూతి పొందే లోపే
వచ్చిన దారినే మళ్ళీ వెనక్కి మళ్ళింది.!!

తెలిసిన మిత్రుడిలా పలకరిస్తుంటే
నా మది పులకరించింది.
ఏదో భావం గుండె లోతుల్లో మెదిలింది.
పాదాల క్రింద ఇసుక తెన్నెలపై ఏదో
పిచ్చి రాతలు రాయాలన్న కోరిక కలిగింది.
రాసీ రాయకుండానే నా రాతల్ని
ఇక చాల్లే అంటూ చెరిపి వెళ్ళ్దింది.
ఇలా కవ్విస్తూ, ఊరిస్తూ, ఉడికిస్తూ హడావిడి చేస్తున్న
ఆ సంద్రాన్ని కాసేపు అలాగే పరికించి చూస్తే

అన్ని భావాలూ తనలో దాచుకున్న
అంతుబట్టని ఓ పరిపూర్ణత గోచరిస్తుంది.
తనకు తాను ఆవిరై బీటలు వారిన భూమికి చినుకు స్పర్శనిస్తుంది.
తల్లిలా ఎన్నో జీవాల్ని తన గర్భంలో దాస్తుంది.
పెద్ద దిక్కులా నదులెన్నో తన అక్కున చేర్చుతుంది.
ఎంతో మందికి జీవనోపాధిస్తుంది.
అందరి నోట రుచులను కలిగిస్తుంది.
గర్బంలో దాచిన తైలాన్ని అందిస్తుంది.
లోతుల్లోంచి ముత్యాల ఆభరణాల్ని వెలికితీస్తుంది!

అంతులేని సముద్రపు లోతుల్లో దాగిఉన్న మర్మాలెన్నో
సముద్ర మధ్యం ప్రశాంతం
కానీ తీరమే అలల అలజడులతో హడవిడిగా ఉంటుంది.
గుండెలోతుల్లో ఘోష తీరానికి మాత్రమే వినిపిస్తుంది.
ఆ ఘోషలోని మర్మమేమిటో అంతుపట్టదు.
తాను పైకి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తుంది.

తన గుండెలో ఏ అలజడి ఉందో!
ఎప్పుడూ ఉప్పొంగి తీరాలను ముంచేస్తుందో!
ఆటుపోట్లతో ఎంతమందిని తనలో కలుపుకుంటుందో!
సునామీలా విరుచుకపడి విలయ తాండవం చేస్తుందో!

అన్నీ తనలోనే ఉన్నాయి.
ప్రశాంతత, భీభత్సం, ఆహ్లాదం ,
అందం, అలజడి, గాంభీర్యం,
ఓర్పు, ఓదార్పు, భావం, రాగం!

సముద్రం ఒక అద్బుతం!
సముద్రం ఒక ఆదర్శం!
సముద్రం ఒక పరిపూర్ణం!!

1 కామెంట్‌: