23, ఫిబ్రవరి 2021, మంగళవారం

మార్పు ఎలా?

ఈమధ్య మన తెలుగు రాష్ట్రాలలో జరిగిన కొన్ని సంఘటనలు విని, చూసి ఎందుకో మనసుకు భాదేసి ఇది రాస్తున్నాను. 
 
ప్రేమ క్షమ
జాలి కరుణ
దయ దాక్షిణ్యం
మనవత్వం దాతృత్వం
ధైర్యం శౌర్యం
వీరత్వం పరక్రమం
సభ్యత సంస్కారం
 
ఇవన్నీ మన సొత్తు అని ఊరకే డంబాలు చెప్పుకొవడం మనకు (భారతీయులకు) వెన్నతో పెట్టిన విద్య. నేను వేరే దేశాలగురించి, అక్కడ జరిగే వాటి గురించి మాట్లడ్దం లేదు. అవి ఇక్కడ అప్రస్తుతం. ఒకరితో పోలిక అసలేవద్దు. నీ సంగతేమిరా అంటే వాళ్ళిలా వీళ్ళిలా అనడం సరికాదు. మన సంగతి మనకు ముఖ్యం. మనము గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు మనలో లోపాలనూ మనమే వెతుక్కోవాలి. సరిదిద్దుకొనే ప్రయత్నం చెయ్యాలి. లోపాలు దాచి గొప్పను ప్రదర్శించే తత్వం ఓ రోగం. 
 
      ప్రతి రోజూ మన చుట్టూ జరిగే సంఘటనలే చూద్దాం. ఆడపిల్లలపై అఘాయిత్యాలు, తప్పును ప్రశ్నిస్తే హత్యాకాండలు, మూఢ నమ్మకాలు, కులం కుమ్ములాటలు, మతం మంటలు. ప్రతి నిత్యం, ప్రతి ఘడియా వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చూస్తూ కూడా మనం గొప్పని, మన ఘనులమని అని చెప్పుకునే అజ్ఞానంలొనే మనం ఉన్నాం. ఇది శోచనీయం. 
 
   నిన్నటికి నిన్న పెద్దపల్లి జిల్లలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యా ఉదంతం మానవత్వానికి మాయని మచ్చ. మన కెందుకులే అన్న మానసిక దౌర్భల్యానికి ఉదాహరణ. చేవచచ్చిన ధైర్యానికి ఇది ప్రతీక. నడిరొడ్డుమీద అందునా రహదారిపై ఇద్దరు ముగ్గురు కిరాయి హంతకులు వేట కత్తులతో విచక్షణ లేకుండా వారిని నరుకుతుంటే, తమాషా చూసింది అక్కడున్న జనం. రెండు బస్సులు, కొన్ని కార్లలో కూర్చొని వేడుక చూసారు జనం. కనీసం ఓ పది మంది అక్కడ చుట్టూ దొరికే కర్రలతో, రాల్లతోనో ప్రతిఘటించుంటే ఆ న్యాయవాదుల ప్రాణాలు పొయేవి కావు. ఏమయ్యింది మానవత్వం, ఎక్కడ దాగింది వీరి ధైర్యం. ఎవరో ఒకడు ముందుకు కదిలి పదండి రక్షిద్దాం అన్న ఆలోచన చేసాడో లేదో. చెయ్యకపోయుంటే అది విచారకరం. 
 
  పైగా ఆ హత్యను తమ ఫొన్ లో చిత్రీకరించడం. ఏమవుతోంది సమజానికి? ఎతువైపు వెళ్తుంది ఈ దేశం? మునుపటి రోజుల్లో పల్లెటూర్లలో ఓ అజ్ఞాత వ్యక్తి చీకట్లో సంచరిస్తూ కనిపిస్తే చూసిన వారు ఊరు ఊరంతా జాగర్త చెప్పివెళ్ళే వారు. దొంగల బెడద ఎక్కువగ వుంటే వంతులేసుకొని కొంతమంది ఊరికి కాపల కాసేవారు. చిన్ని కష్టం ఎదురైనా ఊరంతా కదిలేవారు. మరి ఎమైందీ ఈనాడు.
 
    అధికారం ముసుగులో ఏమైనా చేయొచ్చని కొందరు. ప్రజలేమి అడగరులే, వారేం చేస్తారనే ధైర్యంతో ప్రభుత్వాలు ఉంటున్నారు. ప్రజలదే తప్పు. ఆలోచన లేదు. ప్రశ్నించే ధైర్యం లేదు. ఎవ డో ఒకడు ప్రశ్నిస్తే, అడిగిన వాడిని లక్షంగా జేసుకొని వాడి జీవితాన్ని నాశనం చేసేదాకా వదలరు. ఇదిగో ప్రశ్నించినందుకేగా న్యాయవాదుల అంతుచూసారు. 
 
       ప్రజలందరూ ఏకమై ప్రశ్నించాలి. అవినీతిపై పోరాడాలి. కాస్త ఎక్కువగా వూహిస్తున్నాను కదా. పైన చెప్పుకున్న దానికి విరుద్దంగా ఆలోచిస్తున్నాను కదా. కానీ ఎలా మార్పు వచ్చేది? మార్పు రాదు. సిరివెన్నల గారు సింధూరం చిత్రంలో రాసినట్టు "తనలో రీతిని తన అవినీతిని తమ ప్రతినిధులుగ ఎన్నుకొని", అంతేగా మరి మనలోని అవినీతే సమాజమంతా ప్రతిబింబిస్తున్నది.
శ్రీశ్రీ గారు అన్నట్లు "ఎవడొ చెబితే వినే రోజులు ఏనాడో పోయాయి". ఒకరు చెబితే వింటే పురాణాలు, ప్రవచనాలు, ధర్మ సందేశాలు ఇస్తున్న వారి మాటలు ఏనాడో సమాజాన్ని ప్రభావితం చేసి ఉండాలి. మరి లేదే. చెడు ప్రభావం చూపినంత త్వరగా మంచి ఈ సమాజంపై చూపలేక పోతుందన్న భాధ మనసును తొలచివేస్తుంది. 
 
  మార్పు ఎలా? అలోచనా ధోరణిలో రావాలి. సమాజం పై మన దృక్పధం మారాలి. ఒకరిపై ఒకరు పరొక్షం గా ఆధారపడ్డాం అని గ్రహించుకొవాలి. మనం అన్న స్వార్ధం వీడాలి. మనకెందులే అన్న జాడ్యం వీడాలి. తప్పుని ప్రశ్నిద్దాం. నీతిగా బ్రతుకుదాం. ఎవర్కైనా చెప్పలేకపోయినా మన ప్రవర్తనతో మంచిదనాన్ని, సమాజం పట్ల ఉన్న భాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలుద్దాం. సమాజం లో మార్పు రావాలని ఆకాంక్షిస్తూ ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి