27, డిసెంబర్ 2012, గురువారం

తొలకరి

బీటలు వారిన భూమి చినుకు స్పర్శకు
పరవశించి పరిమళించింది !!

ఆ పరిమళం ఆస్వాదించి మనసు
ఆనందించింది
దాహార్తితో అలమటించిన జనం
గొంతులు తడిపింది
తొలకరి చినుకు తాకిన
అనుభూతి మదిని తాకింది
తడి ఆవిరి అయిన మోములలో
ఆనందపు తడి తాండవించింది
చెట్టు పుట్ట, కొండ, బండ వేడినిట్టూర్పులు
మరచి కాస్త చల్లబడ్డాయి !!
తొలకరి తో ఆనందించిన రైతన్న
నాగలితో కదిలాడు
పొలం పనులు మొదలంటూ రెండు నెలల
విశ్రాంతికి వీడ్కోలు పలుకుతూ వ్యవసాయ కూలీలు
అటకెక్కించిన పుస్తకాల బూజు దులుపుతూ,
స్కూలు యూనిఫామ్ ధరించి
వెనుక పుస్తకాలను తగిలించి
ఆట పాటలకు సమయం తీరిందంటూ
కదిలిన విద్యార్ధులు,
ఎటు చూసినా హడావిడే !!

తొలకరి తెచ్చింది కోలహలం
తొలకరి ఇచ్చింది ఆనందం
తొలకరి పనులకు నాంది పలికింది
తొలకరి ఇక లేవండంటూ పిలుపందించింది
తొలకరి సోమరితనాన్ని వదిలించింది
శ్రమించండంటూ వర్తమానం అందించింది !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి