23, మే 2013, గురువారం

పరిపక్వ జీవితం


ఉండాలోయ్ ఆవేశం!

 తప్పులను వేలెత్తి చూపేందుకు
అసత్యాన్ని ఖంఢించేందుకు
చెడుపై పోరాడేందుకు
దుర్మార్గాన్ని అంతమొందించేందుకు

కావాలోయ్ ఆలోచన!

మంచేదో చెడేదో గ్రహించేందుకు
ఉత్తమోత్తమ నిర్ణయాలు తీసుకొనేందుకు
ఆచితూచి అడుగులేసేందుకు

ఉండాలోయ్ ఆత్మస్థైర్యం!

ఎన్ని కష్టాలొచ్చినా ఎదురు నిల్చేందుకు
పనయినా విజయవంతంగా ముగించేందుకు
ఓటమిలోనయినా క్రుంగక విజయంకై పోరాడేందుకు

కావాలోయ్ మానవత్వం!

మనిషిని మనిషిగా చూసేందుకు
ఆపదలో ఉన్నవానిని ఆదుకునేందుకు
ఆకలితో ఉన్నవానికి సాయం అందించేందుకు

ఉండాలోయ్ ప్రేమానురాగం!

హాయిగా జీవించేందుకు
శాంతంగా బ్రతికేందుకు
తోడునీడలను పొందేందుకు

కొంచెం శాంతం!
కొంచెం విచక్షణ!
కొంచెం వినమ్రత!

ఇవన్నీ కావాలోయ్!

పరిపూర్ణ వ్యక్తిగా ఎదగేందుకు
పరిపక్వ జీవితం పొందేందుకు
నలుగురి లో నేనై
నేనే నలుగురి నై బ్రతికేందుకు
ఉన్నత జీవన పయనం సాగించేందుకు!

20, మే 2013, సోమవారం

ఈ స్వాతంత్ర్యం మనకొద్దు


అరవది ఆరు వసంతాల
స్వతంత్ర్య భారతి వైభవాన్ని
సింహావలోకనం చేసుకున్న నాకు!

కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకూ
సౌరాష్ట్రం నుండి సిక్కిం వరకూ
దర్శనమిచ్చింది
అరాచకం, పైశాచికం, అవినీతి, పేదరికం!

గుప్పెడు మెతుకులు దొరకక
ఎంగిలి మెతుకులకై
ఆశగా చూస్తూ
డొక్కలు ఎండుక పోయి
ఎముకలు గూడయిన
జీవశ్చవాలు అడుగడుగునా కనిపించాయి!
కన్నీరు కార్చేందుకు
కళ్ళలో చెమ్మలేని బ్రతుకులు దర్శనమిచ్చాయి!!

కామంతో కళ్ళు మూసుకపోయి
పశువుల కంటే హీనంగా
వావివరసలు, చిన్నపెద్ద లేకుండా
అతివలపై, పసికందులపై
అత్యాచారలకు తెగబడుతున్న
ఛండాలురు అడు గడుగునా
మేకుల్లా దారిన తగిలారు!

అతివల ఆవేదనలకు
ఆక్రందనలకు పట్టీపట్టనట్లు
వినీవిననట్లుగా చూస్తున్న
సమాజాన్ని గమనించాను
ఖఠినమయిన చట్టాలు తేలేని
సిగ్గులేని పాలకుల్ని చూశాను!

ధనదాహం, స్వార్దంతో
నిండిన మనసులతో
భూముల్ని కబ్జా చేస్తూ
గనుల్ని ఆక్రమించుకుంటూ
దొరికింది దొరికినట్లుగా
దోచుకుంటున్న పాలకులు!

"దొంగ లంజాకొడుకులు అసలే
మసలుతున్న లోకంలో"
అని ఆవేశంలొ పలికిన శ్రీశ్రీ
గళం, కలం పదును
నేటి దుస్థికి అద్దం పడుతుంది.

వీళ్ళు వదిలిందేదీ లేదు!
పశుగ్రాసాల్ని
రక్షణ ఆయుధాల్ని
శవ పేటికల్ని
ప్రక్రుతి వనరుల్ని
ఇలా ఎన్నని చెప్పాలి!
రోజుకో కుంభకోణం!
అవినీతి నిరోధక శాఖనే
అవినీతి బాట పట్టించిన
సమర్ధులు దేశమంతా నిండి యున్నారు!

ఎంతో మంది మహానీయులు ప్రాణాలర్పించి
జైళ్ళల్లో మగ్గి, బ్రిటీషువారి లాఠీలదెబ్బలకు ఓర్చి
సాధించిన స్వాతంత్ర్యం ఇందుకేనా!

జాతి సంపదను దోచుకొనే ఆమోదమా స్వాతంత్ర్యం!
పైశాచికం తో పైబడి అతివల ఉసురు తీయడంకేనా ...!
దోపిడికీ, అరాచకానికి దౌర్జ్ఞన్యాలకు అడ్డు లేకపోవడమేనా స్వాతంత్ర్యం !!

ఇదంతా చూస్తుంటే స్వాతంత్ర్యం
రాకున్నా బాగుండేదేమో !!

మనస్వేచ్ఛను మనమే హరించుకునే
మన శాంతిని మనమే చంపుకునే
మన జాతిని మనమే నాశనం చేసుకునే
స్వాతంత్ర్యం మనకొద్దు!

స్వాతంత్ర్యం అంటే!
శాంతినిచ్చేది!
అభయాన్నిచ్చేది!
అభివృద్ధినిచ్చేది!
మానవత్వం పెంపొందిచేది!

ఇవేమి ఇవ్వని స్వాతంత్ర్యం మనకొద్దు!

27, డిసెంబర్ 2012, గురువారం

వలపు వన్నెలసోన


వలపు వన్నెలసోన
చురుకు చూపుల జాన
సొగసులన్నీ నింపి
కులుకుతూ అడుగేస్తుంటే
నింగి నుండి చంద్రుడు
తొంగి చూడడామరి

లేత బుగ్గల లేడి
కలువ కన్నుల నారి
జాబిలంటి మోముతో
సిగ్గుపడి నవ్వితే
అందమయిన పువ్వులన్నీ
మూతి ముడవవా మరి

కోయిల కంఠంతో
ఓయ్ అని పిలుస్తుంటే
ఆ పిలుపు తాలూకు
జ్ఞాపకాలతో మైమరచి
ఒళ్ళు మరవరా ఆమె అభిమానులు

సుతిమెత్తని ఆ పాదాలు
తాకిన ఆ నేల ముద్దాడిన
అనుభూతి పొందుతూ
గాలికి తనపై రాలిన
పూలనే విస్మరించినే

హొయలయిన ఆ సిగలోకి
చేరాలని మొగ్గలన్నీ
తొందర పడుతూ
ఉదయంకై వేచిచూస్తు
తామే చేరాలని వాదులాడుకున్నయట

పేదవారు

పేదవారు, పీడితులు, సంఘంచే అంటరాని వారు అనబడేవారు, అనాధలు, వారి వారి గుండెల్లొ వేదనలను కవితలుగా వ్రాస్తే, మొదట రాయడానికి పదాలు దొరకవు, రాసినా చదివేందుకు ధైర్యం చాలదు. వారి ఆక్రందనలు, ఆక్రోశాలు, ప్రస్పుటంగా ఊహలకందని భాషల్లొ, పదాలతో కవితంతా నిండి ఉంటాయి. ఆ కవిత చదివి అర్ధం చేసుకొని భరించగలిగే శక్తి ఉంటే వారిని ఇలా ఈ సంఘం పీడించదు. ఆ కవిత రగిల్చే మంటల్లో మసై పోతారు. వారిలో ఇంత ఆక్రందన దాగుందా అని ఆశ్చర్యంలో మునిగి తేలుతారు. వారూ మానవులే అని మరచి ఇన్నాళ్ళూ కళ్ళు మూసుక పోయిన కుటిల నాయకులంతా కంగారు పడతారు. వారి పట్ల సమాజం ప్రవర్తిస్తున్న తీరు, వారిలో ఆగ్రహాల జ్వాలలను రగిలించినా, వారి ఆకలి కేకలు సమాజం చెవిని చేరుకున్న, వారి చావులు సమాజం హృదయాన్ని కరిగించకున్నా, గుండెలోతుల్లో రక్తం మరుగుతున్నా, ఏమీ చేయలేని నిస్సాహాయత, ఎదిరించే బలం లేదు. ఎదిరించినా అణగార్చ బడ్డవారు. వారి ఆవేదన ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేం. ఊహించలేం కదూ. అందుకే వారి ఆవేశాలు, ఆక్రోశాలు కవితగా రాస్తే ఆ పదజాలం నిప్పులు కక్కుతుంది. ఆ కవితలు మంటలు రేపుతాయి. పేలిన అగ్ని పర్వతంలాగా లావా చిందిస్తూ వారి హృదయాంతరాళాల నుండి ఒక్కసారిగా పెల్లుబికిన కవితాగ్ని కణాలకు ఎదురు నిలువ లేక సమాజం భీతిల్లవచ్చు.