15, ఫిబ్రవరి 2021, సోమవారం

స్వార్థం-ఆనందం

 

ప్రాణం ఉన్నంతవరకు మనిషి జీవన పోరటం సాగుతూనే ఉంటుంది. మెతుకుకో , ఉనికికో, గొప్ప పేరుకో, ఆధిపత్యానికో, అధికారనికో, అందలానికో! అనవసరపు దానికోసం చేసే పోరాటంలో స్వార్ధం తప్పితే సహజత్వం కనపడదు. బ్రతకడం కోసం చేసే పోరటంలో సహజత్వం ఉంటుంది కానీ అందుకై దొడ్డి దారిన వెడితే మాత్రం స్వార్ధమే కనపడుతుంది.

స్వార్థం వంచనకు కారణభూతమవుతుంది. వంచన విపరీతాలకు దారితీస్తుంది. ఫలితం పరపీడనం, స్వయం వినాశం, ఆత్మక్షోభ. స్వార్థం మనిషిలోని నిజాయితీని ఎప్పటికప్పుడు తొక్కిపడుతుంది. మంచి ఆలోచనలనే రానీక మనసును తన గుప్పెట్లో బంధిస్తుంది. హృదయాంతరాళాలలో ఎక్కడో దాగున్న నీతిని సైతం అంతం చేస్తుంది..

స్వార్థం కళ్ళకు గంతలు కడుతుంది!

స్వార్థం మనసుకు తెరలను అడ్డేస్తుంది!

ఏదో రూపేణ మనిషి ఆలోచనలలో స్వార్థం బయట పడుతూనే ఉంటుంది. మానసిక ఆనందాన్ని దూరం చేస్తుంది. అంటే ఇక్కడ చెప్పబడుతున్నది తన్మయత్వం. ఆనందం పలురకాలుగా ఉంటుంది. స్వార్థం కూడా ఆనందం తెచ్చిపెడుతుంది. ఎదుటివాడ్ని ఏడిపించో, దొడ్డి దారిన అందలాన్ని అందుకొనో! స్వయంకృషితో అధికారాన్ని, అందలాన్ని అందుకున్న వాడి అనందంలో పైసాచికత్వం లేదు. స్వార్ధం లేదు. నిర్మలత్వం ఉంది. నిర్మలత్వమే తన్మయత్వాన్నిస్తుంది.

స్వార్థం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది కానీ మనసులో ఎదో మూల దాన్ని పొందిన తీరుపై కాస్త అసంతృప్తి అంటూ ఉంటుంది. ఆ అసంతృప్తి వల్లే తన్మయత్వాన్ని పొందలేరు. తన్మయత్వం లేని ఆనందం అనుభవించలేము. అది తాత్కలికముగా ముఖంపై మెరిసి మాయమవుతుంది. హృదయం అనుభవించే ఆనందం మన ముఖాలపై శాశ్వతంగా నిలపడుతుంది.

పొందిన ఆనందాన్ని నలుగురితో పంచుకొనేలా ఉంటేనే అది నిజమైన ఆనందం. ఆనందాన్ని పంచడం అనేది ఒక యోగం. స్వార్థంతో పొందిన ఆనందాన్ని ఎక్కువగా పంచలేము. పంచినా అది ఏదో రూపేణ మనకు ప్రమాదకారి కావొచ్చు. కాబట్టి స్వార్థం వీడదాం.

చేసే ప్రతి పనినీ నిజయతీగా చేస్తూ దానిలో ఆనందం వెతుకుదాం. తన్మయత్వాన్ని పొందుతూ ఆనందం అందరికీ పంచుదాం. మనసును ఆనంద సాగరములో విహరింపచేద్దాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి